Aug 18,2023 21:39

పార్వతీపురం, పాలకొండలో మానహారం నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : రాష్ట్రంలో మున్సిపాల్టీల్లోనూ, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికులందర్నీ రెగ్యులర్‌ చేయాలని కోరుతూ స్థానిక పాతబస్టాండ్‌ వద్ద మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, చనిపోయిన కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలని, పర్మినెంట్‌ పారిశుధ్య కార్మికులకు 11వ పిఆర్‌సిని అమలు చేయాలని, డిఎ చెల్లించాలని, సరెండర్‌ లీవ్‌ అమలు చేయాలని, రెండు నెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఇంజనీరింగ్‌ తదితర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు హెల్త్‌ అలవెన్సులు వర్తింపచేయాలని, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18,500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పాలకవర్గాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని విడనాడి కార్మిక సమస్యలు పరిష్కరించే దిశగా నిర్ణయం చేయకుంటే, భవిష్యత్తులో జరిగే ఆందోళనకు పాలకవర్గాలు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, శివ, రాజేష్‌, సత్తిరాజు, తిప్పలమ్మ, సుజాత, గబ్బర్‌ సింగ్‌, పర్మినెంట్‌ ఉద్యోగుల నాయకులు ఎం.శ్రీను, ఎన్‌.శివ, జి.గంగరాజు, హరి, ఆనంద్‌, మజ్జి తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ: పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పాలకొండ కమిటీ కార్యదర్శి సిహెచ్‌.సంజీవి, ఇంజనీరింగ్‌ విభాగం అధ్యక్షులు వై.హరిబాబు మాట్లాడుతూ సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, పర్మినెంట్‌ చేయాలని, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, పెరుగుతున్న జనాభాకు తగినంత మంది కార్మికులను పెంచాలని, పాలకవర్గాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వెడనాడి కార్మిక సమస్యలు పరిష్కారం చేసే దిశగా నిర్ణయం చేయకుంటే, భవిష్యత్తులో జరిగే ఆందోళనకు పాలకవర్గాలు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో చింతల సురేష్‌, పడాల వేణు, వి. అంజి, జి. సాంబమూర్తి, శ్రీదేవి, విమల తదితరులు పాల్గొన్నారు.