గుత్తి : అనంతపురం జిల్లా సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ సర్పంచి కామ్రేడ్ రామచంద్రారెడ్డికి సిపిఎం నేతలు ఘన నివాళులు అర్పించారు. గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి(76) ఇటీవల అనారోగ్యానికి గురై అనంతపురం ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస వదిలారు. ఆయన పార్థివదేహాన్ని బసినేపల్లి గ్రామంలోని ఆయన నివాసానికి తరలించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు తదితరులు సోమవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామచంద్రారెడ్డి పార్థివదేహంపై సిపిఎం జెండా కప్పి విప్లవ జోహార్లు అర్పించారు. గ్రామ శివారులో రామచంద్రారెడ్డి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, వామపక్ష సానుభూతిపరుల సమక్షంలో సోమవారం నిర్వహించారు. కామ్రేడ్ రామచంద్రారెడ్డి మతి సిపిఎంకు తీరని లోటు అని జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి బి.రామకృష్ణ, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మల్లేష్, వి.నిర్మల, కెవిపిఎస్ మండల కార్యదర్శి యు.మల్లికార్జున, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.రమేష్ తదితరులు రామచంద్రారెడ్డికి నివాళులు అర్పించారు.
పోరాట యోధుడు రామచంద్రారెడ్డి
గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి పోరాట యోధునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో పేదల పక్షాన అనేక పోరాటాలు సాగించారు. సిపిఎం సీనియర్ నాయకులు హంపిరెడ్డితో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. గ్రామానికి పదేళ్లపాటు సర్పంచిగానూ ఆయన కొనసాగారు. బసినేపల్లి గ్రామంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పేదల గుడిసెలు తొలగిస్తుండడంతో బాధితుల పక్షాన నిలిచి పోరాటం సాగించారు. నిర్వాసితులకు మరోచోట గహాలు మంజూరు కోసం పోరాటం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు పేదల కోసం నాలుగు ఎకరాలు భూమిని కేటాయించి వారికి పక్కా గహాలను నిర్మించారు. దళితుల గృహాల మంజూరులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. గ్రామంలోని బీసీ కాలనీలో విద్యుత్ సరఫరా, వీధిలైట్లు ఏర్పాటుకు హంపిరెడ్డితో కలిసి పోరాడారు. రైతులకు ప్రభుత్వ రాయితీ కింద ఇచ్చే ఎద్దులు, బండ్లను మంజూరు చేయించారు. దళితులతో పాటు పలువురికి గొర్రెల పెంపకం కోసం రాయితీ రుణాలు ఇప్పించారు. బసినేపల్లి గ్రామ అభివద్ధికి ఎనలేని కషి చేశారు. మండలంలో ప్రజా ఉద్యమాల్లో ముందుండేవారు. పేదల అభివృద్ధిని కాంక్షిస్తూ జీవితకాలం పాటు నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన పని చేశారు.










