ప్రజాశక్తి-హిందూపురం : పచ్చని పొలాల మధ్య ఉన్న టైర్ల పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో పంటదిగుబడులు తగ్గుతున్నాయి. పంటలు పండక చుట్టు ఉన్నా గ్రామాలతో పాటు పూలకుంట సమీపంలో ఉన్న లోటస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్. సువర్ణ భారతీ కళాశాల విద్యార్థులు సైతంకాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేపాక్షి మండలం చౌళసముద్రం సమీపంలోని రహదారి పక్కన పచ్చని పొలాల్లో పాత టైర్లను బాయిలర్ల సాయంతో దహనం చేసి తద్వారా ఫర్నెస్ అయిల్ వెలికి తీస్తున్నారు. పాత టైర్లను కాల్చడంతో వచ్చే ఫర్నెస్ అయిల్‌ను ఎగుమతి చేస్తున్నారు. అయితే పాత టైర్లు కాల్చడం వల్ల వెలువడే పొగ తీవ్రతకు పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అదే విధంగా టైర్ల బూడిద వల్ల పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు దెబ్బతింటున్నాయి. పచ్చని వ్యవసాయ పోలాల మధ్య టైర్ల పరిశ్రమ నిర్మించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు ఎలా ఇచ్చారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకొంటామని చెప్పే పాలకులు రహదారి పక్కనే ఉన్న పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై నోరుమెదపకపోవటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో పాత టైర్లు కాల్చి తద్వారా వెలువడే ఫర్నెస్ అయిల్‌ను మార్కెట్ చేసుకొంటు లక్షలాది రూపాయలు సంపాందించుకుంటున్న స్వార్థపరులకు రైతుల సమస్యలు పట్టడం లేదని విమర్శిస్తున్నారు. టైర్లుకాల్చిన అనంతరం టైర్ల పౌడర్‌ను సైతం సిమెంట్ పరిశ్రమలకు, రహదారి నిర్మాణల గుత్తేదారులకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. అందులో మిగిలిన దాన్ని సమీప వంకల్లో, పంట పొలాల్లో పడేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో భూమి లోపల సైతం కాలుష్యం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమ రాత్రి పూట మాత్రమే నడుపుతారని పగలు నడిపితే అందులో నుంచి వచ్చే తీవ్రమైనా పొగ వల్ల స్థానికులు అభ్యంతరం చెబుతారని పరిశ్రమ నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి పూట పరిశ్రమ నడిపినప్పటికి పరిశ్రమ నుంచి వచ్చే పొగ గాలిలో కలిసి కాలుష్యం ఏర్పడడంతో 15 రకాల వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాటు పరిశ్రమ నుంచి వెలువడే పొగ వల్ల చుట్టు పక్కల సుమారు 7 కిలో మీటర్ల మేర కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో మల్లిరెడ్డిపల్లి, పూలకుంట, కోడిపల్లి, శ్రీకంఠపురం, నర్సాపురం, మరువపల్లి తదితర ప్రమాల ప్రజలు ఎక్కడో గ్యాస్ లీక్ అయిందని ఇంటి నుంచి బయటకు వచ్చే వారు. ఈ వాసన రాను...రాను ఎక్కువ కావడంతో కొంత మంది పరిశ్రమ వరకు వెళ్లి చూస్తే అసులు విషయం బయటకు పడింది. ఇంత జరుగుతున్నప్పటికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, రెవిన్యూ అధికారులు పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాలను ముందుగా గుర్తించి పరిశ్రమపై సత్వరమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.










