Jul 16,2023 21:42

డంపింగ్‌ యార్డులో పేరుకు పోయిన చెత్త దిబ్బలు

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పట్టణం ఏర్పాటు అయిన సమయంలో పట్టణ సమీపంలోని పరిగి రోడ్డులో సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేశారు. పట్టణ జనాభా పెరగడంతో పరగి రోడ్డు ప్రాంతంలో సైతం జనావాసాలు ఏర్పాటు అయ్యాయి. మొదట్లో చెత్తాచెదారం తక్కువగా ఉండడం ఎలాంటి ఇబ్బంది లేక పోవడం కారణంగా ప్రభుత్వం పేదల కోసం డంపింగ్‌ యార్డు పక్కలోనే ఇంటి స్థలాలను కేటాయించింది. ఫలితంగా ఈ ప్రాంతంలో ఆహ్మద్‌ నగర్‌, సత్య సాయి నగర్‌ రూపుదిద్దుకున్నాయి. వేలాది నిర్మాణాలు జరిగి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ది చెందింది. దీంతో ప్రజలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాలయాలను పురపాలక సంఘంతో పాటు ఇతర శాఖల వారు కల్పించారు. వారి పిల్లల కోసం పాఠశాలను సైతం ఏర్పాటు చేశారు. అయితే పట్టణంలో రానురాను జనాభా పెరగడం, చెత్త ఉత్పత్తి ఎక్కువ కావడం ప్లాస్టిక్‌ ఉత్పత్తులు పెరిగి పోవడం కారణంగా డంపింగ్‌ యార్డుకు చెత్త తరలింపు ఎక్కువ అయింది. ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలు డంపింగ్‌ యార్డులో చేరడంతో చెత్త కుళ్లిపోకుండా కొండలా పేరుకు పోయింది. కొంత కాలంగా కుళ్లుతున్న ఈ వ్యర్థాల నుంచి దట్టమైన పొగ వెలువడుతూ ఈ డంపింగ్‌యార్డు వాయు కాలుష్య ఉత్పత్తి కేంద్రంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతుంది. చెత్త నుంచి మిథేన్‌ తదితర వాయువులతో మంటలు చెలరేగుతున్నాయి. వీటి నుంచి వెలువడే విషయువులు, పొగ సమీప ప్రాంత వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నివాసం ఉండడానికే కష్టంగా మారింది. గత కొన్ని సంవత్సరాలు ఇలాంటి పరిస్థితి ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు శ్వాసకోశ, ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నారు. సమస్య పాలకులకు, అధికారులకు తెలిసినా పరిష్కారానికి చొరవ చూపడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే ఈ డంపింగ్‌ యార్డు నిండి చెత్త కొండలా మారిపోయింది.
నూతన డంపింగ్‌ యార్డుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో అడుగులు పడ్డాయి. పట్టణ సమీపంలో గుడ్డంపల్లి వద్ద దాదాపు 36 ఎకరాల స్థలాన్ని సేకరించి, డంపింగ్‌ యార్డును నిర్మాణం చేశారు. అయితే వివిధ కారణాలతో దానికి పూర్తి స్థాయిలో చెత్త తరలింపు జరగడం లేదు. ఇక్కడి డంపింగ్‌యార్డులోని చెత్తలో రబ్బరు, ప్లాస్టిక్‌, థర్మకోల్‌, ఫైబర్‌ తదితర పనికిరాని వస్తువులను వేరు చేయాల్సి ఉంది. వేరు చేసిన ప్లాస్టిక్‌ను పెన్నా సిమెంట్‌ పరిశ్రమకు తరలించాల్సి ఉంది. అయితే అదేదీ జరగలేదు. డంపింగ్‌ యార్డులో దాదాపు 61.499 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉన్నట్లు అధికారులు అంచనావేసి దీని కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 4.90కోట్లు కేటాయించారు. గుంటూరుకు చెందిన జ్ఞానేశ్వర్‌ ఇంజనీరింగ్‌ ప్రవేటు సంస్థకు 6 నెలల క్రితం పనులను సైతం ఖరారు చేశారు. అయితే ఒక వారం రోజులు పనులు చేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు డంపింగ్‌ యార్డు శాపంగా మారింది.
శాశ్వత పరిష్కారం ఎప్పుడు..?
హిందూపురం రూరల్‌ మండలం గుడ్డంపల్లి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డుకు సేకరించిన చెత్తను పూర్తి స్థాయిలో తరలించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంపేక్టర్‌ ద్వారా తరలించే చెత్తను మాత్రమే ఇక్కడికి తరలిస్తున్నారు. ఆటోల ద్వారా సేకరించిన చెత్తను పట్టణంలో ఉన్నా డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. కొంత మంది ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగతోపాటు, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. శాస్త్రీయ పద్దతిలో చెత్తను వేరు చేసే కార్యక్రమంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు.
న్యాయ పోరాటాలకు సిద్ధం
పట్టణంలో ఉన్న డంపింగ్‌ యార్డును తరలించాలని ఇప్పటికే పాలకులకు, అధికారులకు పలుమార్లు విన్నవించాం. అయినప్పటికి వారిలో కనీస చలనం లేదు. ఈ డంపింగ్‌ యార్డు వల్ల ప్రజలతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో న్యాయ పోరాటాలకు సిద్ధమవుతాం.
శ్రీనివాసులు,
ఒపిడిఆర్‌ రాష్ట్ర అధ్యక్షులు
భయపడుతూ ఉద్యోగం చేస్తున్నాం
డంపింగ్‌ యార్డు పక్కలోనే పాఠశాల ఉండడంతో నిత్యం భయపడుతు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం. ఏ క్షణంలో ఎలాంటి విష పురుగులు విద్యార్థులపై దాడి చేస్తాయో...ఏ క్షణంలో పొగలు వ్యాపిస్తాయో అన్న భయంతో ఇక్కడ పని చేస్తున్నాం. ఈగలు విపరీతంగా ఉన్నాయి.
నఫీస్‌ సుల్తానా,
పాఠశాల హెచ్‌ఎం
ఊపిరితిత్తుల వ్యాధుల వచ్చే అవకాశం
డంపింగ్‌ యార్డులో నుంచి వెలువడే దుర్వాసన, విష వాయువు వల్ల గాలిలో ఆక్సిజన్‌ శాతం తక్కువ ఉంటుంది. ఈ ప్రాంతంలో కలుషితమైన గాలి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు రోగాల బారిన పడి, ఇబ్బందులు ఎదురై, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.
వెంకట రమణ,
చిన్న పిల్లల వైద్యులు
ఉన్న చెత్తను శాస్త్రీయ పద్దతిలో వేరుచేస్తాం
సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ కోసం మున్సిపాలిటీ ఒక ప్రణాళికను ప్రతిపాదించింది, దీని ద్వారా ప్రాసెసింగ్‌ చేస్తున్నాం. ఇప్పటికే దీని కోసం రూ.4.90కోట్లు నిధులు కేటాయించాం. అయితే గుత్తేదారులు పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారితో చర్చించి పనులు ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఇకపై చెత్తను అక్కడికి తరలించకుండా చర్యలు తీసుకుంటాం.
ప్రమోద్‌ కుమార్‌,
మున్సిపల్‌ కమిషనర్‌