- ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలి
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి సంస్థలో విలీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు మీటర్ రీడర్స్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రాజు, నంద్యాల జిల్లా అధ్యక్షులు రామకృష్ణ లు కోరారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం సిఐటియు నగర కార్యదర్శి సి. హెచ్ సాయి బాబా, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ ల ఆధ్వర్యంలో సిఐటియు అనుబంధం ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రాజు, నంద్యాల అధ్యక్షులు రామకృష్ణ లు కలిసి కర్నూలు ఎస్సీ ఎం.ఉమాపతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3800 మీటర్ రీడర్లు దాదాపు పది సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నామన్నారు. గతంలో స్పాట్ బిల్డింగ్ పని 24 రోజులు చేసేవారమని పని దినాలను క్రమంగా కుదిస్తూ 15 రోజులు, 12 రోజులు, తొమ్మిది రోజులు చేశారు. ఇప్పటికే పని భారం ఎక్కువ అయిన తరుణంలో యాజమాన్యం వారు పని దినాలు ఇంకా కుదిస్తూ ఏడు రోజులకే బిల్లింగ్ పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. బిల్లింగ్ పని దినాలు కుదించడం వలన వచ్చే అరకోర వేతనాలు తగ్గిపోయి కుటుంబ పోషణ కూడా భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు .అధికారుల ఒత్తిడి వలన బిల్లింగ్ త్వరగా పూర్తి చేయాలనే క్రమంలో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి .కావున మీటర్ రీడర్లకు నెల రోజులు పని కల్పించి కనీస వేతనం చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు. స్మార్ట్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్ ఉపాధికి ప్రమాదం ఏర్పడనుందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లను సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరారు .వీరిలో 1500 మంది వరకు ఐటిఐ, ఎలక్ట్రికల్ ట్రేడ్ డిప్లమాలు పూర్తి చేసిన వారు ఉన్నారు. కావున వీరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా నియమించాలని కోరారు. అలాగే మీటర్ రీడర్లలో నాన్ టెక్నికల్ గా ఉన్న వారికి వారి అర్హతను బట్టి సంస్థలోనే ఉపాధి కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు పీస్ రేట్ ప్రకారం వేతనం ఇవ్వడం లేదని, మాకు ఈపీఎఫ్ చెల్లించాల్సిన దానికన్నా తక్కువ చెల్లిస్తున్నారని, అందుకు సంబంధించిన స్లిప్పులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మీటర్ లీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారి వేతనాలు అమలు చేయాలని, యాజమాన్యమే నేరుగా వేతనం చెల్లించాలని, కుదించిన పనిని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ వెంటనే స్పందించి రెండు జిల్లాల్లో ఉన్న ఏ .ఏ. ఓ .లతో మాట్లాడారు. ప్రతినెల విద్యుత్ మీటర్ రీడర్లతో సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని , అలా చేయనిపక్షంలో సంబంధిత అధికారులపై
చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎస్సీ ని కలిసిన వారిలో మీటర్ రీడర్లు నాగేంద్ర, వేద వ్యాసముని, హుస్సేన్ భాష, వన్నూరు, కృష్ణ లు ఉన్నారు.










