న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల కోసం జనతాదళ్ (సెక్యులర్) ఎన్‌డిఎతో నేడు తుది చర్చలు జరపనుంది. కర్ణాటకలో నిన్నటి దాకా కాంగ్రెస్‌తో జతకట్టిన జెడి (ఎస్) తాజాగా ఎన్‌డిఎ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బిజెపితో తుది చర్చలు జరిపేందుకు జెడి(ఎస్) అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి గురువారం ఢిల్లీ చేరుకోన్నారు. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటి అధికారిక పోటీలో భాగంగా కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను జెడి(ఎస్) నాలుగు నుండి ఆరు స్థానాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ''ఈ రోజు సాయంత్రం ఇరు వర్గాలు భేటీ కానున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు సాయంత్రం సమావేశం ఉంది. సమావేశం అనంతరం శుక్రవారం బిజెపి ప్రతినిధులతో పాటు అన్ని వివరాలు బహిరంగంగా వెల్లడిస్తాం'' అని హెచ్.డి. కుమారస్వామి ఢిల్లీకి బయలుదేరే ముందు మీడియాకు వివరించారు. అవసరమైతే ప్రధాని మోడీతో, జెడి(ఎస్) వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్.డి దేవగౌడ చర్చలు జరిపే అవకాశం ఉందని అన్నారు.










