Apr 19,2023 16:33

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : బందరు పోర్టు అభివృద్ధి పనులలో భాగంగా పోర్ట్ కనెక్టివిటీ రహదారి పనులు ముమ్మరం చేయాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ బందరు పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పోర్ట్ అభివృద్ధి పనులు పరిశీలించారు. ముఖ్యంగా పోర్టు కనెక్టివిటీ రహదారి నిర్మాణ పనులు గురించి ఆరా తీశారు. ముడ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, చేపట్టవలసిన పనులు గురించి అడిగి తెలుసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నిర్మిత ప్రాంతం పరిశీలించారు. బ్రేక్ వాటర్ ప్రాంతం, డ్రేడ్జింగ్ ప్రాంతం, అప్రోచ్ ఛానల్ ఏరియా వరకు వెళ్లి పరిశీలించారు. టర్నింగ్ సర్కిల్ ఏరియా, ప్రతిపాదిత పైలాన్ ఏరియా,పోర్టు నిర్మిత ప్రాంతం మార్కింగ్, బౌండరీలు పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భారీ యంత్రాలు, మెటీరియల్ తరలించుటకు అనువుగా పోర్టు కనెక్టివిటీ రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఈ పనులు ఇంకా వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రిచే పోర్టు పనులు ప్రారంభింప చేయుటకు సన్నద్ధత పనులు చేపట్టినట్లు తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు మొదలు పెట్టుటకు అవసరమైన భారీ యంత్రాలను నిర్మాణ సంస్థ ఇప్పటికే తరలించిందని, ముఖ్యమంత్రి పోర్ట్ పనులు లాంఛనంగా ప్రారంభించగానే, నిర్మాణ పనులు మొదలవుతాయని తెలిపారు. మేఘా ఇంజనీరింగ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, రైట్స్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ సూర్య, బందరు తాసిల్దార్ డి సునీల్ బాబు, రైట్స్ సంస్థ ప్రతినిధులు జెసి వెంట ఉన్నారు.