ప్రజాశక్తి - సాలూరురూరల్ : జ్యూట్ మిల్లును వెంటనే తెరిపించి, గతంలో పనిచేసిన కార్మికులందరికీ పని కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీగిరాంలోని ఎపి ఫైబర్స్ జ్యూట్ మిల్లు వద్ద రెండో రోజు దీక్షలను ప్రారంభించిన అనంతరం కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ మాట్లాడారు. జిల్లాలో ఉన్న ఏకైక జ్యూట్ మిల్లు అని, దీన్ని నడిపించడంలో అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడి, కార్మిక ప్రయోజనాల దృష్ట్యా చర్చించి, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కార్మిక వర్గం చేస్తున్న న్యాయమైన దీక్షలకు, వారి సమస్యల పరిష్కారానికి చేసే పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని అన్నారు. సాలూరు ప్రాంతంలోనే ప్రజలు, మేధావులు, ఉద్యోగులు, సంఘాలు కూడా అండగా నిలవాలని కోరారు. మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగనమోహన్ రెడ్డి హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక జ్యూట్ మిల్లుల తెరిపించడం మాట పక్కన పెడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేలా పరిశ్రమ అధిపతులకు ఊత మిచ్చి కార్మికుల పొట్టలు కొట్టే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని విమర్శించారు. కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇక్కడే అర్ధమవుతుందని అన్నారు. కావున జ్యూట్ మిల్లును ఎంతటి పోరాటం చేసైనా కాపాడుకోవాల్సిన కర్తవ్యం కార్మికులపై ఉందన్నారు. దీక్షలకు ఎపి వ్యవసాయ కార్మికసంఘం నాయకులు మర్రి శ్రీనివాసరావు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మద్దతు ప్రకటించారు. రెండో రోజు దీక్షల్లో మహిళా కార్మిక నాయకులు రాజాన ఇంద్రావతి, రౌతు సత్యవతి, ఈదుబిల్లి పద్మ, ఎస్.సుశీల, నల్ల దేవి, జెఎసి నాయకులు సింహాచలం, రామారావు, నారాయణరావు, శ్రీనివాసరావు, సింహాచలం పాల్గొన్నారు.










