ప్రజాశక్తి - సాలూరురూరల్ : మండలంలోని జీగిరాంలో గల ఎపి ఫైబర్స్ జ్యూట్ మిల్లును వెంటనే తెరిపించాలని జెఎసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను స్థానిక ఎంపిటిసి సభ్యులు సూరప్పలనాయుడు ప్రారంభించారు. జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జరుగు ఈ దీక్షలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి జ్యూట్ మిల్లును తెరిపించాలని డిమాండ్ చేశారు. సాలూరు మండలం జ్యూట్ మిల్లు జెఎసి నాయకులు సింహాచలం, నారాయణరావు, శ్రీనివాసరావు, మారినాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మాట్లాడుతూ 15 నెలలుగా జ్యూట్ మిల్లును యాజమాన్యం నిరవధికంగా మూసివేసిందని, దీనివల్ల, 2వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందే వాళ్లంతా నేడు వీధిన పడ్డారని అన్నారు. కలెక్టర్, జిల్లా మంత్రి ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం వల్ల నేటికీ పరిష్కారం కాలేదని, కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితిని పాలకులే కల్పించారని విమర్శించారు. న్యాయమైన ఈ సమస్య పట్ల కార్మిక వర్గం పక్షాన సిఐటియు నిలబడుతుందన్నారు. జ్యూట్ మిల్ కార్మికులు చేపడుతున్న కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని, జిల్లాలో ఉన్న ఏకైక పరిశ్రమ సాలూరు జ్యూట్ మిల్లును దీన్ని కాపాడుకోవడానికి ప్రజలు, కార్మికులు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడాలని, సమస్య పరిష్కారానికి అధికారి యంత్రాంగం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.










