-సాలూరు : మండలంలోని జీగిరాం జ్యూట్ మిల్లును 15 నెలలుగా మూసివేసి ఫ్యాక్టరీని తెరిపించడంలో యాజమాన్యం, ప్రభుత్వ అధికారి యంత్రాంగం, తీవ్ర నిర్లక్ష్య ధోరణితో ఉందని, వెంటనే తెరిపించేందుకు చర్యలు చేపట్టకపోతే ఈనెల 7న జీగిరాం నుంచి సాలూరు తహశీల్దార్ కార్యాలయం వరకు కార్మిక కుటుంబాలు, అఖిలపక్షాలతో ర్యాలీ, ధర్నా చేపడతామని అఖిలపక్ష నాయకులు తీర్మానించారు. ఆదివారం కార్మిక జెఎసి నాయకులు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక పెన్షనర్స్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజుదేవ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎస్.బంగారయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్ వై నాయుడు, సిపిఐ జిల్లా నాయకులు ఎస్.రామచంద్రరావు, బిజెపి జిల్లా అధ్యక్షులు జి అప్పలనాయుడు, ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్తేశ్వర పాణిగ్రహి, ఎల్‌ఐసి ఎంప్లాయిస్ యూనియన్ పార్వతీపురం జోనల్ కార్యదర్శి టెక్కలి ధర్మారావు మాట్లాడారు. జ్యూట్ మిల్లును తెరిపించడంలో అధికారి యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందని, 1200 మంది కార్మికులకు ఉపాధినిచ్చే పరిశ్రమ విషయంలో యాజమాన్యం, అధికారులు నిర్లక్ష్యం వీడాలని కోరారు. లేకుంటే ఈనెల 7న జరిగే ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం దిగురాకుంటే అన్ని పక్షాలతో నిరవధిక ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. సమావేశంలో కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ఎన్.తిరుపతిరావు, రూరల్ అధ్యక్షులు ఎ.పరమేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, బిజెపి పట్టణ అధ్యక్షులు పి విశ్వేశ్వరరావు, ఎపిటిఎఫ్ సాలూరు, పాచిపెంట మండలాల నాయకులు గౌరీ శంకర్రావు, నాయుడు, ప్రభాకర్‌రావు, సిఐటియు పట్టణ అధ్యక్షులు టి రాముడు తదితరులు పాల్గొన్నారు.










