Sep 07,2023 21:32

ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు, జెఎసి నాయకులు

ప్రజాశక్తి-సాలూరు : మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్లు తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలని గురువారం కార్మికులు జెఎసి ఆధ్వర్యాన పట్టణంలో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. జెఎసి నాయకులు పి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ 15 నెలలుగా జ్యూట్‌మిల్లు మూతపడ్డంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. 15 నెలలుగా కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలూ చేపట్టలేదన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని యాజమాన్యంతో కనీసం చర్చించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 17 రోజులుగా జ్యూట్‌ కార్మికులు మిల్లు ముందు రిలే నిరాహారదీక్షలు చేపడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. సిపిఎం పాచిపెంట మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ జ్యూట్‌మిల్లును మూసేయడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జ్యూట్‌ మిల్లు తెరిపించకపోతే కార్మికుల ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు చెప్పారు.
జెఎసి నాయకులు రెడ్డి సింహాచలం మాట్లాడుతూ జ్యూట్‌మిల్లు యాజమాన్యం మిల్లుకి సంబంధించిన ఆస్తులను, విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. స్థానిక మంత్రి రాజన్నదొర ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.
అనంతరం డిప్యూటీ తహశృల్దార్‌ భానుప్రసాద్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎస్‌.సింహాచలం, రెడ్డి సత్యం, గొల్లు సత్యనారాయణ, తిరుపతిరావు, అప్పలనాయుడు, కె.సూర్యనారాయణ, కర్రి అప్పారావు, కె.అప్పన్న, కేతిరెడ్డి అప్పలనాయుడు, సుధా, బలరాం పాల్గొన్నారు.