మూలుగుతున్న పల్లెలు, పట్టణాలు
చేతిలో చిల్లిగవ్వ లేక వైద్యం కోసం జనం అవస్థలు
ఆర్‌ఎంపిలు, మందుల దుకాణాలే దిక్కు
ఆరోగ్య సురక్ష సర్వేలో వైద్య శాఖ సిబ్బంది
ప్రజాశక్తి - ఏలూరు, భీమవరం
'పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రెండు జిల్లాల్లోనూ వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జనం జ్వరాలతోపాటు దగ్గు, జలుబుతో సతమతమవుతున్నారు. దీంతో పట్టణాల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆర్‌ఎంపిలను, స్థానిక మందుల దుకాణదారులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నారు. దీనికితోడు టైఫాయిడ్ కేసులు ఎక్కువగానూ, డెంగీ, మలేరియా కేసులు అక్కడక్కడా నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఉమ్మడి జిల్లావాసులు జ్వరాలతో మూలుగుతున్నారు. వాతావరణ మార్పులు, పారిశుధ్యం పడకేయడం, కలుషిత నీరు తదితర కారణాల రీత్యా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణాల్లోని ప్రభుత్వాసు పత్రుల్లో ఓపిలో సగానికిపైగా జ్వరాల కేసులే ఉంటున్నాయి. మిగిలిన సగంలోనూ 90 శాతం శ్వాసకోశ సంబంధిత సమస్యలు, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఇంటింటికీ వెళ్లి వైద్యం అందించే ఆర్‌ఎంపిలకు డిమాండ్ పెరిగింది. ఆసుపత్రికెళ్తే ఓపి చీటీ దగ్గర నుంచి పరీక్షలు, మందులు అన్నింటికీ సుమారు వెయ్యి రూపాయలపైనే ఖర్చవుతుంది. ఒకవేళ రక్త, నీరుడు పరీక్షలు వంటివి రాస్తే ఖర్చు వేలల్లోనే ఉంటోంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడం, ఉపాధి పనులూ అంతంతమాత్రంగా చూపడం, చేసిన పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడం తదితర కారణాల రీత్యా గ్రామీణ పేదలకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్యానికి వేలల్లో ఖర్చు పెట్టే పరిస్థితి లేక ఆసుపత్రులకు వెళ్లలేక బాధితులు ఆర్‌ఎం పిలను ఆశ్రయిస్తున్నారు. తర్వాత డబ్బులిచ్చే ప్రాతిపదికన ఆర్‌ఎంపిలు జ్వరపీడితులకు ఇంజెక్షన్లు, మందులు అందిస్తుండటం పేదలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. తాము గత నెల నుంచి మందులు దుకాణాల వద్ద అరువు ప్రాతిపదికన మందులు తీసుకొచ్చి వైద్య సేవలందిస్తు న్నామని, వైరల్ జ్వరాలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఏలూరు, పెనుమంట్ర ప్రాంతాలకు చెందిన ఆర్‌ఎంపిలు చెబుతున్నారు. ప్రస్తుతం పనులకు అన్‌సీజన్ కావడంతో జనం వద్ద డబ్బుల్లేవని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాత సొమ్ములిచ్చేలా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇక పట్టణాల్లో అయితే ఎక్కువగా మెడికల్ షాపుల వద్దకు వెళ్లి మందులు కొని తెచ్చుకుని వేసుకోవడం కన్పిస్తోంది. జ్వర పీడితులు రెండు నుంచి ఐదు రోజుల్లో కోలుకుంటున్నా విపరీతమైన నీరసం తో బాధపడుతున్నారు. దీంతో వారు మరో వారం రోజులు గడప దాటలేని పరిస్థితి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది.
ఇక టైఫాయిడ్, మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజుల్లో జ్వరం తగ్గనివారు రక్త పరీక్షలు చేయించుకుంటే టైఫాయిడ్ జ్వరాలుగా నిర్థారణ అవుతోంది. దీంతో పరీక్షలకు, తర్వాత కోర్సు వాడకానికి వేలల్లో ఖర్చవుతుందని జనం గగ్గోలు పెడుతున్నారు. డెంగీ కేసులు కూడా అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల భీమడోలు మండలంలో డెంగీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అధికారికంగా వెలుగులోకి వస్తున్న కేసులు కొన్నే ఉంటున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో నిర్థారించిన కేసులు పెద్దగా అధికార యంత్రాంగమూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. మొత్తంగా చూస్తే వైరల్ జ్వరాలతోపాటు టైఫాయిడ్, మలేరియా, డెంగీతో రెండు జిల్లాలవాసులు మూలుగుతున్నారు.
జ్వరాలతో జనం సతమతమవుతుంటే ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, పిహెచ్‌సిల్లో వసతులు మెరుగుపర్చి అన్ని రకాల మందులు అందించడం వంటి చర్యలు చేపట్టడంలో ఉదాశీనత కన్పిస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది ఉండటంతో గ్రామాల్లో జనం ఆరోగ్య సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ప్రభుత్వం స్పందించి జ్వరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రధానంగా పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అదే సమయంలో జ్వరపీడితులకు పిహెచ్‌సిలు, ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతోపాటు అవసరమైన మందులు ఇవ్వాలని, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని జనం కోరుతున్నారు.










