May 22,2023 20:39

నందికొట్కూరు : వినతి పత్రం ఇస్తున్న నాయకులు

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామికం
ప్రజాశక్తి - నందికొట్కూరు

జర్నలిస్టులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరులు హైదరాబాదు, కర్నూల్లోనూ ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా పాత్రికేయులపై దాడి చేసి వారి కెమెరాలను ధ్వంసం చేసి, సెల్‌ ఫోన్లను లాక్కోవడం హేయమైన చర్య అని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దాడులకు నిరసనగా ఏపీ యూడబ్ల్యూజె (ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ చేపట్టారు. నందికొట్కూరు పటేల్‌ సెంటర్లో నిరసన చేపట్టి, అనంతరం తహసీల్దార్‌ రాజశేఖర్‌ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌.ఎస్‌.ఐ, పీడీఎస్‌యూ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే గౌరవాధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ వార్తలను కవర్‌ చేసేందుకు వెళ్లిన విలేకరులపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వర్గీయులు దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉండేజర్నలిస్టులపై దాడులు చేయడం అధికారపార్టీ నాయకులకు తగదన్నారు. ఏపీ రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు విలేకరులపై అర్ధరాత్రి దాడి చేసిన గుంఢాలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయసూర్య, టీడీపీ రాష్ట్ర ముస్లీం మైనార్జీ అధికారప్రతినిధి షకీల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన కొనసాగుతోందన్నారు.ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యకుడు శ్రీనివాసులు, పీడీఎస్‌యూ నాయకులు మర్రిస్వామి మాట్లాడుతూ జర్నలిస్తులపై అధికారపార్టీ గూంఢాలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జయరాజ్‌, గోపి,వెంకటేష్‌, స్వామన్న, ఉమర్‌, తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : పాత్రికేయులపై దాడిని నిరసిస్తూ స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘా నాయకులు కర్నూలు- గుంటూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు జోసఫ్‌ చంద్రశేఖర్‌, వెంకటకృష్ణ, శీలం శేషు, సైఫుద్దీన్‌, తదితరులు మాట్లాడారు. అనంతరం ఆర్డిఓ దాసుకు వినతి పత్రాన్ని అందించారు. పాత్రికేయులు సుధాకర్‌, చంద్ర, సురేష్‌, అన్వర్‌, రవి కుమార్‌, తదితరు పాల్గొన్నారు. పాములపాడు: జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని బీఎస్పీ నందికొట్కూరు ఇన్చార్జి స్వాములు, సిపిఐ నాయకులు రమేష్‌ బాబు, టిడిపి నాయకులు గోవిందు, మండల తెలుగు యువత అధ్యక్షులు మధు కృష్ణ, మాల మహానాడు నాయకులు అంకన్న, నాగరాజు, పత్రికా విలేకరులు మల్లికార్జున శెట్టి, కాజా మొహిద్దిన్‌, షఫీలు అన్నారు. జర్నలిస్ట్‌లపై దాడిని నిరసిస్తూ పాములపాడులో రాస్తారోకో నిర్వహించి, తహశీల్దార్‌ రత్న రాధికకు వినతి పత్రాన్ని అందజేశారు. బేతంచెర్ల : విలేకరులపై ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరులు దాడి చేయడం అమానుషమని మండలంలోని సిపిఎం, సిపిఐ ప్రజాసంఘాలు, టిడిపి, కుల సంఘాల నాయకులు పేర్కొన్నారు. బేతంచెర్ల పత్రిక విలేకరుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అనంతరం బేతంచెర్ల మండలం సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ప్రియతమ్‌ రెడ్డి, ఎస్సై శివ శంకర్‌ నాయక్‌లకు విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్ర మంలో విలేకర్లు వెంకట రాముడు,వేంకటేశ్వర గౌడ్‌,లక్ష్మయ్య,బండ రాముడు, వేణు గోపాల్‌,వి. సుబ్బారాయుడు,మద్దిలేటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.ఆళ్లగడ్డ: విలేకరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎపి రైతు సంఘం నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.