ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని బదినేహాల్ గ్రామంలో సర్పంచి ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గత సర్పంచి మాల రామప్ప మృతి చెందడంతో గ్రామంలో సర్పంచి ఎన్నికకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామంలో వైసిపి మద్దతుదారుడు పెద్ద నరసప్ప పోటీ చేస్తుంగా, టిడిపి మద్దతుదారుల నుంచి హెచ్.వీరేష్ పోటీలో ఉన్నారు.
బదినేహాల్ వైసిపికి కంచుకోట
మండలంలో ఏ ఎన్నికలు జరిగినా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి, వైసిపికి అత్యధిక మెజార్టీ లభిస్తుంది. టిడిపి ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి ప్రత్యేక దృష్టి సారించి బదినేహాల్ గ్రామంలో తిష్ట వేశారు. మండలంలోని క్లస్టర్ ఇన్‌ఛార్జీలతో పాటు నాయకులంతా ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించి ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు వేయాలని అడుగుతున్నారు. తెలుగు రైతు రాష్ట్ర జిల్లా కార్యదర్శి అడివప్ప గౌడ్, వెంకటపతి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప, టిడిపి నాయకులు కోట్రేష్ గౌడ్, టిప్పు సుల్తాన్, కురుగోడు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు, టిడిపి ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు దివాకర్ రెడ్డి రంగంలో దిగి ప్రచారం ముమ్మరం చేశారు. సర్పంచి ఉప ఎన్నికల్లో వైసిపి కంచుకోటను బద్దలు కొట్టి విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి బలపరిచిన అభ్యర్థికి ఒక్క అవకాశమిచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. టిడిపితోనే అభివద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు.
వైసిపి నాయకులు వీరభద్ర గౌడ్, నాకేష్ రెడ్డి, రవీంద్రారెడ్డి, లక్ష్మి రెడ్డి, వాసుదేవర రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మాబు సాబ్ తమ సొంత గ్రామంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి బహుమతిగా అందించాలని సిద్ధపడ్డారు. వైసిపి మండల నాయకులు దాట్ల కృష్ణంరాజు, వీర సేనా రెడ్డి, మండల కన్వీనర్ దేశారు ప్రహ్లాద చారి, ఉరుకుంద ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ నాగరాజు గౌడ్, మహేంద్ర రెడ్డి, రామన్న గౌడ్, ఏకం రెడ్డి, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, సుధాకర్ రెడ్డి, గుడిసె శివన్న, రాఘవేంద్ర రెడ్డి, కౌతాళం సర్పంచి పాల్ దినకరన్, మాజీ సర్పంచి అవతారం, చౌదరి బసవరాజ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొని ప్రచారం చేస్తున్నారు. గ్రామంలో వైసిపి, టిడిపి నాయకులతో ఎన్నికల సందడి నెలకొంది. శనివారం జరిగే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలనుంది.
జగనన్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
- ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి, వైసిపి నాయకులు వై.సీతారామరెడ్డి తెలిపారు. గురువారం బదినేహాల్ గ్రామంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతి ఇంటికీ పథకాలు అందించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రజలు మంచి చేసే వారిని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. వైసిపి నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజాసేవకే అంకితం కావాలని కోరారు. టిడిపి నాయకుల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.










