Aug 28,2023 20:20

కాలువలో స్నానాలు చేస్తున్న భక్తులు

ప్రజాశక్తి - కౌతాళం
శ్రావణమాసం.. ఉరుకుంద క్షేత్రం.. భక్తజన సందోహం... పుణ్యక్షేత్రం నలువైపులా ఈరన్న స్వామి నామస్మరణతో మార్మోగింది. జిల్లాలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారం సాయంత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో ఆంధ్రా రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుణ్యక్షేత్రానికి నాలుగు వైపులు కౌతాళం, ఆదోని, కోసిగి, హాల్వి రహదారుల వైపు సుమారు రెండు కిలోమీటర్ల వరకు భక్తులు వ్యాపించారు. పుణ్యక్షేత్రంలో ఇసుక వేస్తే రాలనంత జన సందోహంతో కళకళలాడింది. సోమవారం తెల్లవారుజామున భక్తులు తుంగభద్ర దిగువ కాలువలో పుణ్యస్నానాలు ఆచరించారు. తడి గుడ్డలతోనే మహిళలు స్వామివారికి ఇష్టమైన నైవేధ్యాన్ని వండి పూజలు చేశారు. మరి కొంతమంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనం కోసం ఆదివారం రాత్రి నుంచి భక్తులు బారులు తీరడంతో దేవాలయ అధికారులు రాత్రి నుంచే దర్శన సౌకర్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిలిచి ఉన్నారంటే ఏ స్థాయిలో భక్తులు తరలివచ్చారో అర్థమవుతోంది. పుణ్యక్షేత్రంలో అన్నదాన సత్రం, టికెట్‌ కౌంటర్లు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట ప్రాంతాలు భక్తులు కిటకిటలాడాయి. దేవాలయ సహాయ కమిషనర్‌ వాణి, పాలకమండలి అధ్యక్షులు నాగరాజు గౌడ్‌, పర్యవేక్షకులు వెంకటేష్‌, రామ్మోహన్‌, దేవాలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా పర్యవేక్షించారు.
20 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
పుణ్యక్షేత్రంలో భక్తుల కోసం 20 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. భక్తులకు అవసరమున్న చోటును గుర్తించి ప్రత్యేకమైన సింటెక్స్‌ స్టాల్‌ ఏర్పాటు చేశారు. కల్యాణ కట్ట వద్ద షవర్లను ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు తుంగభద్ర దిగువ కాలువలోనే స్నానాలు ఆచరించారు. భక్తులకు నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
భారీ బందోబస్తు
ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సిఐ ఎరిషావలీ, ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో మరికొంతమంది సిఐలు, ఎస్‌ఐలతో బందోబస్తు నిర్వహించారు. కల్యాణకట్ట, దర్శనం క్యూ లైన్‌, తుంగభద్ర దిగువ కాలువ వద్ద దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్రంలో ముఖ్యమైన చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

ఆలయ ఆవరణలో ఉన్న భక్తులు
ఆలయ ఆవరణలో ఉన్న భక్తులు