Sep 22,2023 21:59

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - మక్కువ : కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ నేతృత్వంలో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 97 అర్జీలు అందాయి. అర్జీదారుల నుంచి కలెక్టరేట్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, డిఆర్‌ఒ కె.హేమలత ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ, ఇపిడిసిఎల్‌ సంబంధిత సమస్యలపై ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందుతున్న వినతులు పట్ల శ్రద్ద వహించి, తక్షణ పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. స్వీకరిస్తున్న ఆర్జీలకు పక్కాగా పరిష్కారం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన పలు వినతులు ఈ విధంగా ఉన్నాయి.
మండలంలోని పనసభద్రకు చెందిన దీసరి చిన్న తమ గ్రామంలో పెద్ద విద్యుత్‌ ట్రాన్స్ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఖయిరువలస, పీడ్లవలస, సెంగంవలస గ్రామాల్లో తమ తాతకు భూములున్నాయని, ఆయన వారసుల్లో ఇద్దరు జీవించి ఉన్నారని వారిలో ఒకరు మొత్తం భూములు పంపకం చేయడం లేదని, ఆస్తుల పంపకం గూర్చి అడిగితే దాడులు చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఖయిరు వలసకు చెందిన వెన్నెల నాగేశ్వర రావు, ఈశ్వర రావు ఆర్జీని సమర్పించారు. దబ్బగెడ్డకు చెందిన ఇప్పాకుల మురళి తమ భూ సమస్య పరిష్కారించాలని, ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరారు. మార్కొండపుట్టుకు చెందిన అల్లు గౌరునాయుడు పాస్‌ బుక్‌ మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఇదే గ్రామానికి చెందిన బొంగు పాప తనకు మూడో విడత ఇంటి బిల్లు మంజూరు చేయాలని కోరారు. సన్యాసిరాజుపురంకు చెందిన బొత్స ప్రకాష్‌ పింఛను మంజూరు చేయాలని ఆర్జీని సమర్పించారు. శాంతపురంకు చెందిన పాటూరు రవణమ్మ భూ సమస్య పరిష్కరించాలని కోరారు. బందలుప్పికి చెందిన మత్స శివ అనువంశికంగా వస్తున్న భూమిని ఇతరులు ఆక్రమించారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. పెదబంటుకు చెందిన వై.అన్నపూర్ణమ్మ తన భూమి ఆక్రమణకు గురైందని, సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. మడవలసకు చెందిన మెళ్లక కుసుమ తమ గ్రామంలో వ్యవసాయ బావి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మీపురంకు చెందిన తంగుడు సుజాత పాసు పుస్తకం సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.