శ్రీనగర్ : ఉగ్రవాదితో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ జమ్ముకాశ్మీర్ పోలీస్ శాఖలో డిఎస్‌పిగా విధులు నిర్వహిస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్‌ను అరెస్ట్ చేశారు. అవినీతితో పాటు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు సహాయం చేశాడని, ఉగ్రవాదిని విచారిస్తున్న అధికారిని ఇరికించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ముస్తాక్‌ను శ్రీనగర్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఆరు రోజుల కస్టడీ విధించినట్లు తెలిపారు.
జులైలో అరెస్టయిన ఓ ఉగ్రవాది ఫోన్‌ను దర్యాప్తు చేయగా ఆదిల్ ముస్తాక్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాడని తేలిందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. చట్టం నుండి తప్పించుకోవడంలో తనకి సాయం చేసినట్లు విచారణలో ఉగ్రవాది వెల్లడించినట్లు పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ముస్తాక్ ఉగ్రవాదితో మాట్లాడటం, మెసేజ్‌లు చేయడం వంటివి చేసినట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. డిఎస్‌పి ఆదిల్ ముస్తాక్‌కి, ఉగ్రవాదికి మధ్య 40 ఫోన్‌కాల్ సంభాషణలు జరిగాయని, అరెస్టును తప్పించుకోవడం, న్యాయసాయం పొందడంపై డిఎస్‌పి సూచనలు ఇస్తున్నాడని అన్నారు. ఉగ్రవాదులకు నిధులు అందించే కేసులో దర్యాప్తు అధికారిని ఇరికించేందుకు తప్పుడు ఫిర్యాదును రూపొందించారని చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసులో ముజ్మిల్ జహూర్ అనే వ్యక్తి కీలకమని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే అరెస్టు అయిన వారిలో ఒక వ్యక్తి దర్యాప్తు అధికారిపై అవినీతి ఆరోపణలు చేసినట్లు ఆదిల్ ముస్తాక్ ఓ ఫిర్యాదును రూపొందించినట్లు వెల్లడించారు. ఆదిల్ ముస్తాక్ కేసును విచారించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించినట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఓ పోలీస్ ఉన్నతాధికారిని అరెస్ట్ చేయడం గత మూడేళ్లలో ఇది రెండో కేసు. 2020లో ఇద్దరు హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, ఢిల్లీకి పంపిన డిఎస్‌పి దేవిందర్ సింగ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.










