ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లాలో వదలని వానతో గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మన్యాన్ని గురువారం కూడా వర్షం వదల్లేదు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కొనసాగి..గురువారం ఉదయం కూడా భారీ వర్షం కురిసింది. ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏజెన్సీలోని అన్ని ప్రధాన గెడ్డలు, వాగులలో వరద ఉదృతి నెలకొంది. మారుమూల ప్రాంతాల్లో గెడ్డలు, వాగులన్ని ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గెడ్డలను దాటి ప్రయాణం చేసేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు.
ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో కొండ వాగులు, గెడ్డలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ, చింతపల్లి మండలాల్లోని ప్రధాన గెడ్డలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రవాణా సంబంధాలు నిలిచి పోయాయి. పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది ప్రమాదకరంగా గెడ్డలు దాటాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 269.2. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా బుధవారం 697 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జి.మాడుగుల మండలం మారుమూల కిల్లంకోట పంచాయతీ కప్పలు గ్రామ సమీపంలో కోడిమామిడి గెడ్డ ఉప్పొంగింది. గ్రామానికి చెందిన ఆరుగురు మంగళవారం ఉదయం పశువులను మేపడానికి సమీప కొండకు వెళ్లి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. పశువులతో గ్రామానికి చేరుకోవడానికి కోడిమామిడి గెడ్డను దాటాల్సి ఉంది. గెడ్డ ఉప్పొంగడంతో గెడ్డ దాటడానికి సాధ్యం కాక మంగళవారం రాత్రంతా పశువులతోపాటు అడవిలోనే ఉండిపోయారు.
పెదబయలు మండలంలో గిన్నెలకోట, ఇంజరి, జామిగూడ, గుల్లెలు పంచాయతీలకు వెళ్లే గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. గిరిజనులు గెడ్డలు దాటేందుకు ప్రయత్నించవద్దని, వర్షాల నేపద్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముంచింగిపుట్టు మండలంలో లక్ష్మీపురం పంచాయతీలోని తుమిడిపుట్టులో బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.ప్రవాహం తగ్గడంతో మృతదేహాన్ని గెడ్డను దాటించి దహన సంస్కారాలు నిర్వహించారు. అలాగే కర్లపొదార్, లక్ష్మీపురం గ్రామ సమీపంలోని గెడ్డలు ఉప్పొంగి వంతెన పైనుంచి ప్రవహిస్తున్నాయి. ముంతగుమ్మి, తుమిడిపుట్టు, బిరిగూడ గెడ్డల ఉదృతితో బుంగాపుట్టు, లక్ష్మీపురం పంచాయతీలకు చెందిన సుమారు 18 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. కరిముఖిపుట్టు వద్ద కల్వర్టుపై నుంచి నీరు ప్రవహించడంతో కుమడ, బూసిపుట్టు, కొరవంగి బాబుసాల ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి.
డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీ శివనగరం, పోతంగి పంచాయతీ సంపపెట్టి వంతెనలపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుం డటంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హుకుంపేట మండలంలోని చీడిపుట్టు, సంతారి గెడ్డలతో పాటు మత్స్యగెడ్డ ఉధతంగా ప్రవహిస్తోంది. చీడిపుట్టు వంతెన పైనుంచి గెడ్డ ప్రవహించడంతో బారపల్లి, అడ్డుమండ తదితర గ్రామాల నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.జికె వీధి మండలం రింతాడ పంచాయతీ పరిధిలోని చాపగెడ్డ కుమ్మరివీది విద్యార్థినీ, విద్యార్థులు కిలోమీటరు దూరంలోని చాపగెడ్డ పాఠశాలకు వెళ్తున్నారు. వర్షాకాలంలో కాలువ, బురద దారిలో వారి బాధలు వర్ణనాతీతం. ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న భయంతో బురద దారి ఆపై కాలువ దాటి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి.జి.మాడుగుల నుంచి పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల వరకు విస్తరించి ఉన్న ప్రధాన మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం అధికమైంది. పాడేరు మండలం బొక్కెళ్లు సమీపంలోని రాయిగెడ్డ కాజ్ వే లో నీటి ప్రవాహం జోరందుకుంది. బుంగ గెడ్డ చిలకలమామిడి గెడ్డ, మత్స్యగెడ్డల్లో, పంట పొలాల్లో వర్షపు నీరు అధికంగా వచ్చి చేరింది. మండల కేంద్రాల్లో ఆయా ప్రదేశాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వల్ల చిన్న వ్యాపారులు, ప్లాట్ ఫామ్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షంతో ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు వసతి గృహాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రాలలో జనసంచారం తక్కువైంది. వర్షాలతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అనంతగిరి, పాడేరు, లంబసింగి, ధారకొండ, మారెడుమిల్లి, మోతుగూడెం ఘాట్ ప్రాంతాల్లోను భారీ వర్షాలు కురుస్తుండడంతో వాహనాల ప్రయాణానికి ఆలస్యమవుతుంది.
కొట్టుకు పోయిన కల్వర్టు
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ సంగంవలస గ్రామంలో కల్వర్టు వర్షాలకు కొట్టుకు పోయిందని సర్పంచ్ కొర్ర త్రినాథ్ తెలిపారు. కల్వర్టు, రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని త్రినాధ్ డిమాండ్ చేశారు, ఆయన మాట్లాడుతూ.అరుకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ , ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, అల్లూరి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రోజెక్ట్ అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడు సంవత్సరం క్రితం నిర్మించిన కల్వర్టు కొట్టు కోపోయిందన్నారు. గెడ్డ అవతల పాఠశాల ఉండటంతో విద్యార్దులు గెడ్డ దాటలేక మూడు రోజుల పాటు పాఠశాలకు వెళ్లలేదన్నారు.. ఈ విషయం పై గతంలో అనేక సార్లు స్పందనలో వినతి పత్రాలు అందజేసినా స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సంగంవలస వార్డు సభ్యుడు ఎ.అనంతరం, గ్రామస్థులు ఏ.మహేష్, కే.నాగరాజు తదితులు పాల్గొన్నారు.










