ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ : సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప స్పష్టం చేశారు. స్థానిక రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ లో జరిగిన యుటిఎఫ్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిపిఎస్‌లో కొత్తదనం ఏమీ లేదన్నారు సిపిఎస్ పథకంలోనే కొన్ని మార్పులు చేసి జిపిఎస్‌గా పేరు పెట్టారని అన్నారు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగి తన వేతనంలో 10 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని 33 శాతం పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని చెప్పారు. ఉద్యోగికి చివరి వేతనంలో సగభాగం పెన్షన్ గా ఇస్తారని అన్నారు. ఉద్యోగి ఎలాంటి చందా చెల్లించిన అవసరం లేదని అందువల్ల ఒపిఎస్ మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో సిపిఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ దానిని రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నాయని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే సిపిఎస్ ను రద్దుచేసి ఒపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు పెన్షన్ పథకం వర్తిస్తున్నప్పుడు ఉద్యోగులకు లేకపోవడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సి. లింగమయ్య, గౌరవ అధ్యక్షులు ఎస్‌వివి. రమణయ్య ,ఉపాధ్యక్షులు ఆర్. రామప్ప చౌదరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ ,జిల్లా కార్యదర్శి రవికుమార్, సంజీవ్ కుమార్, ఆడిట్ కమిటీ కన్వీనర్ సుబ్బరాయుడుతో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.










