ప్రజాశక్తి - ఆస్పరి
జింకల బారి నుంచి పంటలను కాపాడాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతు, మండల అధ్యక్ష, కార్యదర్శులు రంగస్వామి, మధు రెడ్డి కోరారు. సోమవారం తహశీల్దార్ కుమారస్వామికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 20 ఏళ్ల నుంచి మండలంలోని రైతులు సాగు చేసిన పంటలను జింకలు నాశనం చేస్తున్నాయని తెలిపారు. పాలకులు, అధికారులకు రైతు సంఘం నాయకులు అనేక సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో పంట పెరిగే వరకు రాత్రి, పగలు కాపలా కాస్తూ, పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు స్పందించి జింకల బారి నుంచి పంటలను కాపాడేందుకు దేవరగట్టులో జింకల పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. రైతుసంఘం నాయకులు భాస్కర్, నాగరాజు, సంజీవ్, వీరేష్ పాల్గొన్నారు. కౌతాళం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం స్పందనలో తహశీల్దార్ రామేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య, నాయకులు ఉలిగయ్య, నారాయణ, ఎంకోబా, వీరేష్, సత్యప్ప, వలీ, వెంకన్న పాల్గొన్నారు.










