ప్రజాశక్తి-అనంతపురం క్రైం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న జిల్లాలోని డాబాలు, హోటళ్లపై పోలీసులు శనివారం దాడులు, తనిఖీలు నిర్వహించారు. 'అనంతలో' డాబా(ర్లు) అనే శీర్షికతో ప్రజాశక్తి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన పోలీసులు జిల్లావ్యాప్తంగా హోటళ్లు, డాబాలపై తనిఖీలు, దాడులు చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న డాబాలపై దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ హోటళ్లు, డాబాల్లో మద్యం విక్రయించడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమన్నారు. జిల్లాలోని హోటళ్లు, డాబాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా కర్నాటక మద్యం అక్రమ రవాణా, విక్రయాలు జరుగుతున్నా, డాబాల్లో మద్యం తాగడానికి అనుమతిస్తున్నా ఫోన్ నెంబర్ 94407 96800కు సమాచారం తెలియజేయాలని కోరారు. వీటితోపాటు నగరంలోని లాడ్జీలను తనిఖీ చేశారు.
డాబాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు










