Oct 01,2023 21:18

రామినాయుడువలసలో జొన్నపంటను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : ప్రజల పాపమో లేక పాలకుల నిర్లక్ష్యమో తెలియదు గానీ గత కొన్నేళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాను అడవి జంతువుల బెడద వెంటాడుతుంది. జిల్లా ఏర్పాటైన తర్వాత వీటి సంఖ్య మరింతగా పెరిగింది. దీంతో ప్రజా జీవనానికి, వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఫ్యాక్టరీల పేరుతో అడవులను నాశనం చేయడంతో అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులకు రక్షణ కరువై, ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ప్రజల మధ్య తిరుగుతూ ప్రాణాలను తీస్తూ, పంటలను సర్వనాశనం చేస్తూ జనజీవనానికి ఆటంకంగా మారాయి. అయినా అధికారులకు, పాలకులు పట్టడం లేదు.
17 ఏళ్లుగా వీడని ఏనుగుల సమస్య
మన్య ప్రాంతంలో అడవి ఏనుగుల సమస్య ఈనాటిది కాదు. గత 17 ఏళ్లుగా ఉంది. ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి విఫలం కావడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడవి ఏనుగుల గుంపు కదలికలపై మాత్రమే అటవీశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు. 2006లో ఒడిశా రాష్ట్రం లఖేరి అడవుల నుంచి 11 ఏనుగుల గుంపు గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు వాటి సంఖ్య పెరుగుతూ నాలుగు దిక్కులా విస్తరించాయి. ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడ్డారు. జియమ్మ వలస, కొమరాడ, కురుపాం మండలం జరడ, బలిజిపేట, వీరఘట్టం ప్రాంతాల్లో అడవి ఏనుగుల గుంపు సంచారంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మరోవైపు ఈ మధ్య కాలంలో పెద్దపులి అడుగు జాడలు భామిని, కంబర, సీతంపేట పరిసరాల్లో కనిపించింది. దీంతో పులి సంచారం ఉందని కొందరు, పులిని చూశామని మరికొందరు చెప్పడంతో ప్రజల్లో భయం మరింత రెట్టింపు అయింది. గత ఏడాది కురుపాం ఏజెన్సీలో ఎలుగుబంట్లు సంచారం కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
చెరుకు, మొక్కజొన్న తోటల్లో ఏనుగులు గుంపు సంచారం
కురుపాం: మండలంలోని రామినాయడువలస, కన్నపుదొరవలస గ్రామాల మధ్య ఆదివారం ఏడు ఏనుగుల గుంపు సంచారిస్తు సమీప చెరుకు, మొక్క జొన్న తోటల్లో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ గ్రామాల రైతులు మాట్లాడుతూ ఇంతవరకు ప్రశాంతంగా ఉంటూ పంటలను సాగు చేసుకుంటున్న సమయంలో ఏనుగులు మా గ్రామాల మధ్య సంచరిస్తుండంతో ఏ క్షణాన ఏం జరుగుతుందని భయభ్రాంతులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా రైతు కుటుంబాలమేనని, పంటలను సాగు చేసుకుంటూ నిత్యం పొలాల్లో ఉంటూ వ్యవసాయన్ని నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని అటువంటిది ఏనుగులు ఏ క్షణాన ఏం చేస్తాయోనని భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. కావున సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి మా ప్రాంతం నుండి ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరలించి తమ పంటలను, మా ప్రాణాలను కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు.