పుట్టపర్తి అర్బన్ : గృహ నిర్మాణశాఖ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు సూచించారు. బుధవారం నాడు పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ 1979వ సంవత్సరంలో హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పడగా, 44 సంవత్సరాలు పూర్తయి 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు. హౌసింగ్‌లో ఒక్కో అధికారి తన సర్వీసులో అర్హత ఉన్న పేదవాళ్లకు వెయ్యికి తక్కువ కాకుండా, అంతకంటే ఎక్కువగానే ఇల్లు నిర్మిస్తున్నారని చెప్పారు. ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు. ఎంతో నిబద్ధతతో పని చేసే అధికారులు గహ నిర్మాణ శాఖలో ఉన్నారన్నారు. గతేడాది ముఖ్యమంత్రి జిల్లాలో 10 వేల ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం ఇచ్చారన్నారు. ఇప్పటికే 11 వేలకు పైగా ఇళ్లు పూర్తి చేసి 100 శాతానికి పైగా అధికంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. మళ్లీ ఇచ్చిన 15 వేల లక్ష్యానికి 83 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం అన్నారు. ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గహ నిర్మాణ శాఖలో పనిచేసే ఉద్యోగులకు చెస్, క్రికెట్, క్యారం బోర్డ్, టగ్ ఆఫ్ వార్, టెన్నిస్, మ్యూజికల్ ఛైర్స్, రంగోలి క్రీడలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన వారికి మెమొంటో, సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, డీఈలు నాగరాజు, షామీర్ బాషా, రంగనాయకులు, ఏఈలు, వర్క్ ఇన్స్‌పెక్టర్లు, డిఈవోలు పాల్గొన్నారు.










