అనంతపురం కలెక్టరేట్ : జిల్లాకు కొత్తగా 12,570 ఈవీఎంలు వచ్చాయని, వాటిని నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం కాంపౌండ్‌లోని గోడౌన్‌లో జాగ్రత్తగా భద్రపరిచినట్లు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు. శనివారం నాడు నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఆవరణంలో జిల్లాకు కొత్తగా వచ్చిన ఈవీఎంలను డిఆర్‌ఒ గాయత్రీదేవి, ఆర్డీవో మధుసూదన్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జెసి పరిశీలించారు. అందరి సమక్షంలో ఆయా ఈవీఎంల గోదాము గదుల తలుపుల సీళ్లను జాయింట్ కలెక్టర్ తీయించారు. తర్వాత లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలతో పాటు గదులను, భద్రత చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరుస్తున్న తీరు పట్ల సంతప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం బెంగళూరులోని బెల్ కంపెనీ నుంచి అనంతపురం జిల్లాకు కొత్తగా 12,570 ఈవీఎంలను పంపించిందన్నారు. అందులో 7,070 బ్యాలెట్ యూనిట్స్, 5,500 కంట్రోల్ యూనిట్స్ ఉన్నాయన్నారు. ఈవిఎంలను గోడౌన్లో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీధర్ మూర్తి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.










