ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : 14 నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే జీతం ఇప్పించాలని కోరినందుకు ఆ గ్రీన్ అంబాసిడర్‌ను ఏకంగా విధుల నుంచి సర్పంచి, పంచాయతీ కార్యదర్శి తొలగించారు. ఇదేమిటని అడిగితే నీకు దిక్కున చోట చెప్పుకో అని అతడ్ని బెదిరించిన సంఘటన పార్వతీపురం మండలంలో జరిగింది.
ఈ సంఘటనపై విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇఒపిఆర్‌డి కృష్ణుడుకు గురువారం వినతిని అందజేశారు. అనంతరం గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ పార్వతీపురం మండలం వీరభద్రపురంలో గ్రీన్ అంబాసిడర్‌గా జామి రాము ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. గత 14 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో జీతాలు ఇప్పించాలని స్థానిక సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్‌ను కోరగా, మీకు జీతాలివ్వడం కుదరదని, నీ దిక్కున చోట చెప్పుకో అనడంతో ఆ గ్రీన్ అంబాసిడర్ ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడు. అంతటితో సర్పంచ్ ఆగకుండా వేరే ఒకర్ని పనిలో నియమించారు. తాను విధుల్లో ఉండగా వేరే ఒకర్ని ఎలా నియమిస్తారని అంబాసిడర్ రాము పంచాయతీ సెక్రెటరీ అడిగితే, అతను కూడా అదే మాట అన్నారు. నీ జీతం డబ్బులు కూడా ఇవ్వమని బెదిరింపు గురిచేశారని అన్నారు. 14 నెలలుగా గ్రామంలో పారిశుధ్య పనులు చేయించుకొని ఆర్థిక ఇబ్బందులతో జీతం ఇవ్వమని అడిగితే ఏకంగా విధుల్లో తొలగించడమే కాకుండా వేరే మరొకరికి నియమించడం అన్యాయమని, ఈ సంఘటనపై విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. సంఘటనకు కారణమైన సర్పంచి, పంచాయతీ కార్యదర్శులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










