ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు పరిధిలో ఉన్న రెండు కాలువలకు గురువారం నీటిని విడుదల చేశారు. కుడికాలువకు 100 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 100 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. కొద్ది నెలల క్రితం వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండుతున్నా నీటిని విడుదల చేయాలని వేడుకున్నా తాగునీటి అవసరాల సాకు చూపి ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను నేపథ్యంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలిచి పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుత తరుణంలో అవసరం లేకున్నప్పటికీ కాలువలకు నీటిని విడుదల చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్యాంలో ఉన్న 0.75 టిఎంసిల నీటిని ప్రాజెక్టు నూతన గేట్ల ఏర్పాటు కోసమే నీటిని కిందికి వదిలి వృథా చేస్తున్నారని మరి కొంతమంది రైతులు విమర్శిస్తున్నారు.
అవసరం లేకున్నా నీటి విడుదల
- కెవి.కృష్ణారెడ్డి, మాజీ ఎంపిపి
గాజులదిన్నె ప్రాజెక్టు పరిధిలోని కాలువలకు నీటి విడుదల చేసేటప్పుడు ఆయకట్టు రైతులతో చర్చించి విడుదల చేయాలి. కొద్ది నెలల క్రితం తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండుతుండగా నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. అప్పుడు అధికారులు నీటిని విడుదల చేయలేదు. కొద్ది రోజులుగా వర్షాలు కురిసి పంటలు దెబ్బతింటున్న తరుణంలో అవసరం లేకున్నా కాలువలకు నీటిని విడుదల చేసి వృథా చేయడం సరికాదు.
ఎడమ కాలువలో పారుతున్న నీరు










