Oct 22,2023 23:54
సిసిరోడ్లను ప్రారంభిస్తున్న మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కుంచేపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కుంచేపల్లి గ్రామ పంచాయతీలోని గురవాయపాలెం గ్రామం నుంచి దాసర్లపల్లి గ్రామానికి రూ.కోటి 45 లక్షలతో నిర్మించిన సిమెంట్‌ రోడ్డును ఆయన ప్రారంభించారు. కుంచేపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు కక్ష కట్టాయన్నారు. గ్రామసీమల అభివృద్ధి ద్వారానే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్మే ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, ఆర్‌బికెలు, విలేజ్‌ క్లినిక్‌లు వంటి చారిత్రక కార్యక్రమాలతో దేశంలో ముందడగు వేస్తున్నామని అన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి మండల జేఏసీ కన్వీనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌రెడ్డి, ఏరా నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు పూలమాలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో సిమెంట్‌ రోడ్లు, పాలశీతలీకరణ కేంద్రం, డిజిటల్‌ లైబ్రరీ, సంక్షేమ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాములపాడు గ్రామ సర్పంచ్‌ పేరం చంద్రమ్మ కోదండ రామిరెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్సులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కెవి రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీను, మండల కన్వీనర్‌ హనీమూన్‌ శ్రీనివాసరెడ్డి, మాదాలవారిపాలెం సొసైటీ చైర్మన్‌ ఆనికాల ఈశ్వర్‌రెడ్డి, ఉద్యోగ సంఘం నాయకులు గూడూరి వినోద్‌, మండల యూత్‌ అధ్యక్షులు గుజ్జుల గిరిబాబురెడ్డి, పంచాయతీరాజ్‌ డి ఈ శ్రీధర్‌ రెడ్డి, ఏఇ షేక్‌ మస్తాన్‌వలి, వ్యవసాయ శాఖ అధికారి షేక్‌ జైనులాబ్దిన్‌, పశువైద్యాధికారి మంచికల మణిశేఖర్‌, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.