ప్రజాశక్తి-కలక్టరేట్ ( కృష్ణా) : ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఆర్ధికసాయం అందించడం జగనన్న వసతి దీవెన లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా సింగనమల నియోజక వర్గం నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం కింద బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణాజిల్లాకు సంబంధించి జగనన్న వసతి దీవెన పథకం క్రింద 33,442 మంది విద్యార్ధుల యొక్క 29,545 మంది తల్లుల ఖాతాల్లో రూ. 31.65 కోట్లు జమ చేస్తూ నమూనా చెక్కును కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. పేదరికం విద్యకు అడ్డుకాకూడదనే లక్ష్యంతో పేద విద్యార్ధులకు ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ అందించేందుకు ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పధకంతో పాటు ఉన్నత చదువు చదివే పేద విద్యార్థులు భోజన వసతి ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న వసతి దీవెన పథకం అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద లబ్ది అందుకున్న తల్లులు తమ పిల్లల కోసం వినియోగించాలని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విద్యార్ధులు కష్టపడి చదివి వృద్ధిలోనికి రావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. .
ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎ. శ్రీనివాసరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణి దూర్జటి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.










