ప్రజాశక్తి - వీరఘట్టం : జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. 173 మంది ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ కలెక్టరు నిశాంత్ కుమార్‌కు అర్జీలను అందజేశారు. మండల స్థాయిలో ప్రత్యేకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఆర్‌డిఒ కె.హేమలతతో కలిసి అర్జీదారుల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జెకెసి వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జెకెసి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, దీనిపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. అధికారులు ఇకపై మండల స్థాయిలో పర్యవేక్షణ చేసి తగిన సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. జెకెసి ముగిసిన పిదప మండలస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ సొంత, వీధుల్లోని, గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కలెక్టరుకు తమ సమస్యలను వివరించారు. వీటిలో ముఖ్యమైన కొన్ని సమస్యలు...
వీరఘట్టం ప్రధాన రహదారి విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు మంజూరుచేయాలని, ముచ్చర్ల వీధిలో పారిశుధ్యం అద్వాన్నంగా ఉందని, రక్షిత మంచినీరు సక్రమంగా రావడం లేదని, సొంతిల్లులేని వారికి ప్రభుత్వం స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే దశమంతపురంలో రహదారులు నిర్మించాలని, స్మశానవాటికిను అభివృద్ధి చేయాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. వీరఘట్టంలోని ఒట్టిగెడ్డ, రెల్లివీధి సమీపానున్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని ,రోడ్డు నిర్మించాలని, వీరఘట్టం కళింగ వైశ్య సంఘం సభ్యులకు కమ్యూనిటీ భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, వీరఘట్టంకు మంజూరైన ఐటిఐ కాలేజీ నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టేందుకు కషి చేయాలని కోరారు. అలాగే వీరఘట్టం -విశాఖపట్నం కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, వీరఘట్టంకు పాలకొండ, పార్వతీపురం ల నుండి నైట్ హాల్టు బస్సులను ఏర్పాటుచేయాలన్నారు. వీరఘట్టం మేజర్ పంచాయతీ ప్రజలకు అచ్చెపువలస సమీపంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని, ఇందుచే వీరఘట్టంకు సమీపంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అర్జీ ఇచ్చారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. జె.గోపాలపురం రహదారిని బాగు చేయాలని, కస్పా వీధి సమీపంలో ఉన్న ఒట్టి గెడ్డ కు రక్షణ గోడ నిర్మించాలని, ఆ వీధిలో తాగునీటి పరిష్కరించాలని కోరారు. తొలుత మండలానికి విచ్చేసిన కలెక్టరుకు ఎమ్మెల్యే కళావతి, ఎంపిపి డి.వెంకటరమణనాయుడు దుస్సాలువ, పుష్పగుచ్చంతో సత్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










