Sep 20,2023 21:40

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - కొమరాడ : జిల్లా కలెక్టర్‌ స్థాయిలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం మండలంలో బుధవారం జరిగింది. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మండల ప్రజలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వర్షాన్ని సైతం లెక్కజేయకుండా వినతులు సమర్పించారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఆర్‌డిఒ కె.హేమలత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 60 ఆర్జీలు అందాయి.
త్వరితగతిన పరిష్కారమే ధ్యేయం
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమర్పించిన ఆర్జీలకు త్వరితగిన పరిష్కారమే ధ్యేయమనికలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. మండల స్థాయి సమస్యలు మండలంలోనే పరిష్కారం కావాలని ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు. మండలంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 57 ఆర్జీలు అందాయని ఆయన అన్నారు. వీటిలో కొన్ని ఫిర్యాదులు...
మండలంలోని కంబవలసలో శ్మశాన వాటికకు వెళ్లి రావడానికి జంఝావతి కాలువ మీదగా రోడ్డు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్‌ అంబటి వెంకటలక్ష్మి, గ్రామస్తులు వినతిని అందజేశారు. కొమరాడ గ్రామంలో ఉపాధి హామీ చట్టం ద్వారా అమలవుతున్న పనుల్లో వేతనాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఒడ్డి తిరుపతిరావు దరఖాస్తు అందజేశారు. మండలంలోని 31 పంచాయతీల్లో 9 పంచాయతీలకు అవసరమైన పూర్లపాడు-లాబేసు వంతెన పనులు పూర్తి చేయకపోవడంతో 9 పంచాయతీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం నాయకులు వి.ఇందిర, కె.సాంబమూర్తి, గిరిజనులు కోరారు. గంగరేగువలసలో గల రసాయన పురుగుల మందు ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసి రైతులను కాపాడాలని కోరుతూ ఎంపిటిసి సభ్యులు ఎం.వెంకటనాయుడు వినతిని అందజేశారు. మండలంలోని సీసాడవలసలో సిసి రోడ్డు, కాలువల్లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొండ నుంచి వచ్చే ఊట నీరుకు రక్షణ గోడ నిర్మించాలని సిపిఎం ప్రతినిధి కొల్లి.సాంబమూర్తి అర్జీ అందజేశారు. కొమరాడ మీదుగా కూనేరు నుండి 3 రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గాన ఉన్న గోతులను పూర్తిస్థాయి మరమ్మత్తు పనులు చేపట్టాలని, జీడిపంట వేసిన గిరిజన రైతులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు మన్యం జిల్లాలో ఒక జీడి ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని, కొమరాడలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని కొల్లి.సాంబమూర్తి కోరారు. గుణవతీలేసుకు చెందిన ఎం.శ్రీను ఎస్‌టి కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. చినఖేర్జలకు చెందిన కె.ఉదరుకుమార్‌ తన భూమిని వేరే వాళ్లు ఆక్రమించారని, వారిని తొలగించి తన భూమిని తనకు ఇప్పించాలని అర్జీ అందజేశారు. మాదలంగికి చెందిన శిష్టు వెంకట నాయుడు తన భూమిని వేరే వాళ్లు ఆక్రమణ చేసి ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.