అనంతపురం కలెక్టరేట్ : జగన్నకు చెబుదాం అర్జీలపై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.గౌతమి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని కృష్ణ కళామందిర్‌లో అనంతపురం అర్బన్‌కు సంబంధించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు నగర పాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఆర్డీవో మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్‌పై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు లబ్ధిని చేకూర్చాలన్నారు. జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ 1902తో ఇంటి వద్ద నుంచే ఫోన్ చేస్తే ఫిర్యాదుదారు అర్జీని నమోదు చేసుకుని సంబంధిత జిల్లా, సంబంధిత గ్రీవెన్స్ పరిష్కరించే అధికారికి ఫిర్యాదును పంపుతున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా, మండల, సచివాలయ స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రస్తుతం ప్రతి వారంలో బుధవారం, శుక్రవారం రోజుల్లో మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రమణారెడ్డి, పిఆర్ ఎస్‌ఈ భాగ్యరాజ్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ఓబుల్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










