Apr 26,2023 22:36

మెగా చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌, తదితరులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం క్రింద 2022-23 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద రూ. 33.68 కోట్లు మంజూరు అయినట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనంతపురం నార్పల లో బటన్‌ నొక్కి నిధులు విడుదల చేసిన నేపథ్యంలో కలెక్టరేట్‌ లో ఆ దృశ్యాన్ని వీడియో ద్వారా కలెక్టర్‌ తో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రమణారెడ్డి, ఆర్డీవో భాగ్యరేఖ, పుడా చైర్పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శివరంగ ప్రసాద్‌ తదితరులు వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడతలో 35,080 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో రూ. 33.68 కోట్లు నేరుగా జమ అయ్యాయని అన్నారు. ఇందులో ఎస్సీ సంక్షేమం క్రింద 4683 మంది విద్యార్థులకు రూ.4.47 కోట్లు, ఎస్టీ సంక్షేమం క్రింద 1951 మంది విద్యార్థులకు రూ. 1.84 కోట్లు, బీసీ సంక్షేమం క్రింద18,582 మంది విద్యార్థులకు రూ. 17.83 కోట్లు, కాపు సంక్షేమం క్రింద 2,775 మంది విద్యార్థులకు రూ. 2.65 కోట్లు, ఈ బిసి క్రింద 3,684 మంది విద్యార్థులకు రూ. 3.60 కోట్లు, ముస్లిం మైనార్టీ క్రింద 3,380 మంది విద్యార్థులకు రూ. 3.25 కోట్లు, క్రిస్టియన్‌ మైనార్టీ క్రింద 25 మంది విద్యార్థులకు రూ. 2.30 లక్షలు లబ్ధి చేకూరుతోందన్నారు. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ప్రభుత్వం తగిన చేయూతనిస్తోందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ అధికారులు మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మల దేవి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.