May 24,2023 22:02

జగన్న విద్యాదీవెన సాయం మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

       పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో జగనన్న విద్య దీవెన కింద 31,675 మంది విద్యార్థులకు రూ.25.33 కోట్లు లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఎ.రమణారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఓబుళపతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్‌, బిసి సంక్షేమ శాఖ అధికారి నిర్మల జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు మంజూరు అయిన 25.33 కోట్లను 29,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రతి త్రైమాసానికి ఒకసారి క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులు కూడా ఐటిఐ, పాలిటెక్నికల్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదివేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదువుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు 25.33 కోట్లు మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.