పుట్టపర్తి అర్బన్:పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవానీ శంకర్‌లు ఇందులో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రతి ఇంటికీ వాలంటీర్లు వెళ్లి సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సంక్షేమ పథకాలు, ఇతర సమస్యలు ఉంటే అర్హులై ఉండి లబ్ధి పొందని వారు ఉంటే వారిని గుర్తించి వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. వారికి ఏమైనా కుల, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలు కావాల్సిన వారి నుంచి దరఖాస్తులు తీసుకుని సచివాలయానికి తీసుకెళ్లి టోకెన్, సర్వీసు నెంబర్లను తిరిగి వారి ఇంటి వద్దకే అందజేయాలన్నారు. ఈ క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తారో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు తెలపాలన్నారు. కుల, ఆదాయ, జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు, కొత్త రేషన్ కార్డు, కార్డు విభజన, కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా ఈ కార్యక్రమంలో అందించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు రేపటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. జులై 1 నుంచి క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, సర్వే ల్యాండ్స్ ఏడీ రామకృష్ణ, సచివాలయాల నోడల్ అధికారి శివారెడ్డి, ఎపిఎంఐపి పీడీ సుదర్శన్, మార్కెటింగ్ ఏడీ మూర్తి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, పట్టు పరిశ్రమ అధికారి పద్మమ్మ, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు, ఎంపిపి ఎవి.రమణారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ తుంగ ఓబుళపతి, పుడా ఛైర్‌పర్సన్ లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.










