ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : ప్రజల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని వైసిపి నాయకులు కావల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కోడూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఎంపిడిఒ ప్రత్యూష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో ఎటువంటి ఖర్చులు లేకుండా ఉచితంగా చికిత్సలు అందిస్తున్నట్లు రంగారెడ్డి తెలిపారు. కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కె. నరేంద్ర, వైద్య నిపుణులు డాక్టర్లు ఎం. రజని కుమారి (గైనకాలాగిస్ట్), జనరల్ మెడిసిన్ డాక్టర్ కె. పెంచల ప్రసాద్, వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. వైసిపి నాయకులు మాచిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, ఆగాల శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.










