ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న సురక్ష కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, సచివాలయాల నోడల్ అధికారి శివారెడ్డి, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజా సమస్యలు గుర్తించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. శనివారం 24వ తేదీ నుంచి నెలరోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం పై అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లు, గహ సారధులు షెడ్యూల్ గురించి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ముందుగానే గహసారథులు వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వ పథకాలు, సమస్యలు ప్రజల నుంచి తెలుసుకొని వాటిని సేకరిస్తారన్నారు. మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు ఉండి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించడంతో పాటు అవసరమైన పత్రాలు జారీ చేయాలన్నారు. ప్రజలు తమ సమస్యలను జగనన్న సురక్ష కార్యక్రమం నుంచి పరిష్కరించుకోవచ్చన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. జులై 1 నుంచి ఆగస్టు 1 వరకు ప్రతి వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేయాలని తహశీల్దార్లు, ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. కుల, నివాస, ధ్రువీకరణ పత్రాలు, జనన, మరణ, సర్టిఫికెట్లు, రేషన్ కార్డుల విభజన తదితర సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ పశు బీమా పథకానికి సంబందించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డిపిఒ విజరు కుమార్, డిఎంహెచ్‌ఒ కష్ణారెడ్డి, సర్వే ల్యాండ్స్ ఏడీ రామకృష్ణ, పశు సంవర్ధక శాఖ జెడి శుభదాస్, ద్వామా పీడీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










