ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన '' జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023-24'' లను సోమవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఏ నెలలో సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అందజేయవలెనో షెడ్యూల్ వివరిస్తూ క్యాలెండర్లో పేర్కొన్నారు. జిల్లా అధికారులు వారి శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనల మేరకు పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఎం. వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శివ నారాయణ రెడ్డి, మచిలీపట్నం ఆర్డిఓ ఐ కిషోర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ చైతన్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్, డి ఎల్‌డిఓ సుబ్బారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్పందన అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : ప్రజల నుండి అందే స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ డా. అపరాజిత సింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం సంయుక్త కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో డిఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శివ నారాయణ రెడ్డి, మచిలీపట్నం ఆర్డిఓ ఐస్ కిషోర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ చైతన్య లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి పిఎస్‌ఆర్ ప్రసాద్, జడ్పీ సీఈవో జ్యోతి బసు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిపిఓ నాగేశ్వర్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్.ఈ.లు సత్యనారాయణ రాజు, రమణారావు, ముడ విసి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.










