ప్రజాశక్తి -పాడేరు: జగననన్న చేదోడు పధకం నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, ధర్జీలకు ఎంతో ఉపయుక్తమని, వారు ఆర్ధికంగా ఎదగాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జగనన్న చేదోడు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. గురువారం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన నాల్గవ విడత జగనన్న చేయూత కార్యక్రమంలో భాగంగా పాడేరు కలక్టరేట్ సమావేశ మందిరం నుండి కలెక్టర్, బిసి కార్పోరేషన్ అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బిసి సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, వాటి ఫలాలు అర్హులందరూ పొందాలని కోరారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, ధర్జీలకు ప్రతి ఏటా రూ. పది వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించటం గొప్ప విషయమని, ఇప్పటి వరకు నాలుగు విడతలలో రూ 40 వేలు అందించారని తెలిపారు.జిల్లాలో ఈ ఏడాది నాల్గవ విడత కింద 3,839 మంది లబ్దిదారులకు పది వేల రూపాయలు చొప్పున రూ.3,83,90,000లు చెక్కును లబ్దిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా అందచేసారు. నాలుగేళ్ళలో 9,859 మంది లబ్దిదా రులకు రూ.9,85,90,000 అందజేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. అరకు నియోజక వర్గంలో 881 మంది, పాడేరు నియోజకవర్గంలో 1126 మంది, రంపచోడవరం నియోజక వర్గంలో 1832 మంది లబ్ది పొందారని వివరించారు. అందులో నాయీ బ్రాహ్మణులు 202 మంది, రజకులు 301 మంది, ధర్జీలు 3,336 మంది ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పోరేషన్ ఎఇఓ శంకర్, తదితరులు పాల్గొన్నారు.










