ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
'జగనన్న చేదోడు' నాలుగో విడత ప్రారంభానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరుకు రావడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని, ప్రజలకు ఒరిగిందేమీ లేదని టిడిపి నాయకులు మండిపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కోట్ల క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెండింగ్ ప్రాజెక్టులైన వేదవతి, గుండ్రేవుల, ఆర్‌డిఎస్ కుడి కాలువ నిర్మాణం, ఎల్‌ఎల్‌సి, అండర్ గ్రౌండ్ పైపులైన్ పనుల గురించి సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించకపోవడం జిల్లాపై ఆయనకు ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థమవుతుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి హంద్రీనదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలన్న వినతి మినహాయిస్తే, నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగింది శూన్యమన్నారు. ఆయన తనయుని టికెట్‌పై ఉన్న ఆరాటం అభివృద్ధిపై లేకపోవడం శోచనీయమన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎమ్మిగనూరుకు పైపులైన్ ద్వారా తాగునీటి ప్రాజెక్టుకు ఎఐఐబి పథకం కింద రూ.148 కోట్లు టిడిపి హయాంలో మంజూరు చేయించినట్లు తెలిపారు. చేనేతల ఉపాధి కోసం మే 2, 2015న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనవాసి గ్రామంలో టెక్స్‌టైల్స్ పార్కు కోసం 91.31 ఎకరాల భూమి కేటాయించి నిధులు కేటాయించారని చెప్పారు. దీనిని వైసిపి ప్రభుత్వం వేరే జిల్లాలకు తరలించిందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని ముఖ్యమంత్రి జగన్ పూర్తి చేశారని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చెప్పడంలో వాస్తవం లేదన్నారు. నాగలదిన్నె బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చొరవతో రూ.42 కోట్లు విడుదల చేయించినట్లు గుర్తు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో 100 పడకల ఆస్పత్రి టిడిపి హయాంలోనే మంజూరయిందని పేర్కొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు సహకారంతో, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, ఆత్మ మండల మాజీ ఛైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మాసుమాన్‌దొడ్డి శ్రీనివాసులు, తెలుగు మహిళా నాయకులు గోకారమ్మ, టిడిపి ముస్లిం, మైనార్టీ నాయకులు కెఎమ్‌డి.అబ్దుల్ జబ్బార్, ఆఫ్గాన్ వలిబాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు దర్జీ మోషన్న, ఎస్.సాల్మన్, జాలవాడి ఏసన్న, పందికోన సురేష్, కె.తిమ్మాపురం గ్రామ నాయకులు కురువ వీరేష్, మార్కు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు










