జగన్ పని అయిపోయింది..
- వైసిపి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి రండి
- వైఎస్‌ఆర్ ఆశయాన్ని నెరవేరుద్దాం
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయిందని, వైసిపి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని నెరవేరుద్దామని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి తెలిపారు. నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జె.లక్ష్మీ నరసింహ యాదవ్‌తో కలిసి ఆయన సోమవారం నంద్యాలలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసిపి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని, జగన్ శంకరగిరి మాన్యాలకు పోక తప్పదని, ఈ లోపలే జైలుకు కూడా పోవచ్చని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రైతులు రగిలిపోతున్నారని, మహిళలు, మందు బాబులు మండిపోతున్నారని, ఉద్యోగులు ఉడికిపోతున్నారని, యువత ఆవేశంతో ఉన్నారని, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారని, సర్పంచులు ఆగ్రహంతో ఉన్నారన్నారని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతి, అరాచక, మద్యం, జూదం, గంజాయి, డ్రగ్ ఆంధ్రప్రదేశ్‌గా మారిందని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ల్యాండ్, మైన్, ఎర్రచందనం, బియ్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విమర్శలు చేశారు. అదానీ వ్యవహారంలో మోడీ ప్రతిష్ట, వివేక హత్య కేసు వ్యవహారంలో జగన్ ప్రతిష్ట అధ:పాతాళానికి పడిపోయిందన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి స్వగహప్రవేశం చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే జీవితాశయమని చెప్పిన వైఎస్‌ఆర్ ఆశయ సాధన కోసం వైసిపిలో ఉన్న కాంగ్రెస్ వాదులు చేయి చేయి కలపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. సమావేశంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి స్వామి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ హబీబ్ ఖాన్, జిల్లా ఎస్సీ అధ్యక్షులు నాగలింగం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు సంపంగి రామకృష్ణ, జిల్లా ట్రెజరర్ ఎస్‌వైడి ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు చాబూలు సలాం, జిల్లా కార్యదర్శి రఫీ, జిల్లా కార్యదర్శి రెహ్మాన్, రియాజ్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.










