Oct 04,2023 21:42

పిఒకు వినతిని అందజేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - జియ్యమ్మవలస : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 50 అర్జీలు అందాయి. అర్జీదారుల నుండి పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి విష్ణు చరణ్‌, ఆర్డీవో కె.హేమలత వినతులను స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు పరిష్కరించాలని, సామాజిక పింఛన్లు పునరుద్ధరించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు, కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లింపులకు అర్జీలను అందజేశారు. అనంతరం పిఒ మాట్లాడుతూ జగనన్న కు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్ర స్థాయిలో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏనుగులను వెంటనే తరలించాలి : సిపిఎం
గుమ్మలక్ష్మీపురం: పంటలను నాశనం చేస్తూ, ప్రజల ప్రాణాలను తీస్తున్న అడవి ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని ఐటిడిఎ పిఒకు సిపిఎం నాయకులు వినతి ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ 2007 నుంచి ఏనుగులు మండలంలో సంచరిస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నాయన్నారు. మూడు ప్రభుత్వాలు మారినా ఏనుగులను తరలించలేనిపరిస్థితుల్లో ప్రభు త్వాలు ఉన్నాయని అన్నారు. గత పది రోజులుగా రామినాయుడు వలస, పెదమేరంగి, గౌరమ్మ పేట, సీమనాయుడు వలస, బాసంగి, పరజపాడు, పిప్పల భద్ర, కేటీవాడ, నీచకువలస గ్రామాల్లో పంటలు నాశనం చేస్తున్న ఏనుగులను వెంటనే తరలించాలని కోరారు. అలాగే పార్వతీపురం నుంచి జియ్యమ్మవలస మీదుగా టికే జమ్ముకు బస్సు నడపాలని కోరారు. సుమారు 50 గ్రామాల గిరిజనులు మండల కేంద్రానికి రావాలంటే బస్సు సౌకర్యం లేదని, కురుపాం మీదుగా రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని, కావున బస్సు నడపాలని కోరారు. వినతిని అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి కోరంగి సీతారాం, నాయకులు భూతాల మోహన్రావు సోమయ్య బలరాం పాల్గొన్నారు. అలాగే దీర్ఘకాలిక గిరిజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘ అధ్యక్షు, ఉపాధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్‌, ఆరిక చలపతిరావు, నాయకులు ఎస్‌.మణికేశ్వరావు, సింహాచలం, తదితరులు ఉన్నారు.