Sep 14,2023 21:25

సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

పార్వతీపురంటౌన్‌: జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌)తో ప్రతి కుటుంబానికి అత్యుత్తమ వైద్యం అందుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి. జగన్నాథరావు అన్నారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఆశా, నోడల్‌ అధికారులతో గురువారం స్థానిక జిల్లా ఆరోగ్య కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్నాథరావు పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేసి, దిశా నిర్దేశం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి కుటుంబానికి అత్యుత్తమ వైద్యం అందించడానికి ప్రజలందరికీ ఇంటి వద్దే వైద్య పరీక్షలు, ఉచిత వైద్య సలహాలు, మందులు అందిస్తామన్నారు. మొదటిదశ ఈ నెల 15 నుంచి ప్రతి ఇంటికి వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజా ప్రతినిధులు దర్శించి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తారన్నారు. రెండో విడత ఇంటింటికి ఆరోగ్య సర్వేలో ప్రతీ గ్రామ/వార్డ్‌ సచివాయంలో ఎఎన్‌ఎం, ఆశాలు ఒక బందంగాను, సిహెచ్‌ఒ, ఆశాలు మరొక బందంగా ఏర్పడి 15 నుండి ప్రతి ఇంటినీ సర్వే నిర్వహించి ఇంటి వద్ద ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను తనిఖీ చేసి పేర్ల జాబితా తయారు చేస్తారన్నారు. మూడవ దశలో ఈనెల 30 నుండి ప్రారంభం కానున్న వైద్య శిబిరాలను 2 లేదా 3 రోజుల ముందే సంసిద్ధం చేస్తారన్నారు. క్యాంపు తేదీ, సమయం, వైద్య నిపుణుల వివరాలు, ఉచిత పరీక్షలు గురించి చెప్పి ఆయా జాబితాలో ఉన్న రోగులను శిబిరానికి తరలించాలన్నారు. నాల్గవ దశలో తహశీల్దార్లు, ఎంపిడిఒలు, వైద్యాధికారులు బందంగా ఏర్పడి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తారన్నారు. ఐదో దశలో రోగులకు ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ, అవసరమైన వారికి నెట్‌ వర్క్‌ ఆసుపత్రలకు రిఫరల్‌, పర్యవేక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భవ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుండి అక్టోబర్‌ 2 వరకు పక్షోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి రోజున ఆరోగ్య కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యం, అవయవ , రక్త దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాల ప్రగతి నివేదికలను పరిశీలించి సమీక్షించారు. సమావేశంలో జిల్లా ఆర్‌బిఎస్‌ కె అధికారి డాక్టర్‌ డి. భాస్కరరావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి. జగన్మోహనరావు, డిఎల్‌ఎటిఒ డాక్టర్‌ శ్యామ్‌ కుమార్‌,ఎఫ్‌ డిపి నోడల్‌ అధికారి డాక్టర్‌ వినోద్‌, ఎపిడిమియాలజిస్ట్‌ డాక్టర్‌ నవీన్‌ కుమార్‌, డిపిహెచ్‌ఎన్‌ఒ ఉషారాణి, డిపిఓ లీలారాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ వెళ్లాలి
వీరఘట్టం : ప్రతి ఇంటికి వెళ్లాలని మండల ప్రత్యేక అధికారి పి కిరణ్‌ కుమార్‌, సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎఎన్‌ఎం, సచివాలయ కార్యదర్శులు, డిజిటల్‌ సహాయకులు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మాట్లాడారు. టోకెన్లు వైద్య తనిఖీలకు వచ్చిన వారికి అందజేయాలన్నారు. అత్యవసర పరిస్థితులయితే అవసరమైన, మెరుగైన వైద్యం కోసం వైద్యుల వద్దకు తరలించాని సూచించారు. సమావేశంలో ఎంపిడిఒ జిజె ప్రసాద్‌, తహశీల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ, వీరఘట్టం, బిటివాడ పిహెచ్‌సిల వైద్యాధికారులు నితీష్‌, ప్రదీప్‌ కుమార్‌, వైద్య, సచివాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కరపత్రాలను ఆవిష్కరించారు.