ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో వివిధ రహదారులకు సంబంధించి భూ సేకరణ పక్రియ త్వరగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో భూ సేకరణకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే 342, 716 జి, కదిరి బైపాస్, కౌలేపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి లకు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. సకాలంలో భూ సేకరణ పూర్తి అయితే రహదారుల నిర్మాణాలు పూర్తి అవుతాయని దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూ సేకరణలో నెలకొన్న సమస్యలను ఆర్డీవోలు పరిష్కరించాలన్నారు. ఏవైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో పుట్టపర్తి, కదిరి, ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, కలెక్టరేట్ జి సెక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ, నేషనల్ హైవే ఇఇ మధుసూదన్, డిఇ గిడ్డయ్య, ఆయా మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.










