ప్రజాశక్తి-ఆలూరు
పెండింగ్‌లో ఉన్న 167వ జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు కెపి.నారాయణస్వామి, మండల కన్వీనర్ షాకీర్ కోరారు. సోమవారం కలెక్టర్ డాక్టర్ సృజన దేవరగట్టుకు వచ్చిన సందర్భంగా ఆలూరు గెస్ట్ హౌస్‌లో సిపిఎం నాయకులు, పట్టణ ప్రజలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడారు. ఆదోని నుంచి చింతకుంట వరకు 167వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నూతన బిటి రోడ్డు నిర్మాణాన్ని ఎస్‌ఆర్‌కె కన్‌స్ట్రక్షన్ గుత్తేదారు నాలుగేళ్లుగా నత్తనడకన పనులు చేపడుతున్నారని తెలిపారు. ఆలూరు బెల్లిగుండు ఆంజనేయస్వామి విగ్రహ ఆవరణలో తొలిగేట్ నిర్మాణం కోసం ఉన్న రోడ్డును తవ్వి గుంతలమయంగా మార్చారని చెప్పారు. డ్రెయినేజీ, రోడ్డు వేస్తామనిపట్టణంలో ఇరువైపులా ఉన్న చిన్నాచితక దుకాణ దారులను తొలగించి వారి జీవనోపాధిని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదైనా రోడ్డు వేయలేదని, జాతీయ రహదారి కావడంతో దుమ్ము, ధూళి, గుంతలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రజలు, వాహన దారుల ఇబ్బందులను గుర్తించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ... సంబంధిత అధికారులతో చర్చించి పనులు చేపడతామని తెలిపారు. డివైఎఫ్‌ఐ నాయకులు మైనా, గోవర్ధన్, పట్టణ దుకాణదారులు మారెప్ప, రామదాసు, ఉసేని, చంద్ర, మల్లికార్జున పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు










