ప్రజాశక్తి-చల్లపల్లి
అఖండ భారతావనిలో సగర్వంగా ఆవిష్కతమయ్యే అత్యున్నత జాతీయ పతాకం మువ్వన్నెల జెండా. అటువంటి మహోన్నత పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులుగా ప్రతిఒక్కరిపై ఉంది. పింగళి వెంకయ్య స్వగ్రామం చల్లపల్లి మండలం యార్లగడ్డ. తల్లిదండ్రులు పింగళి హనుమంతరాయుడు, వెంకటరత్నం. 1878 ఆగస్ట్ 2వ తేదీన ఆయన జన్మించారు. వెంకయ్య అమ్మమ్మ, తాతయ్యలు సీతమ్మ, చలపతిరావుల స్వగ్రామం మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి. చలపతిరావు పెదకళ్లేపల్లిలో ఠానేదారుగా పనిచేసేవారు. ఐదేళ్ల వయసు వచ్చే వరకూ వారి వద్దనే పెరిగారు. పెద్దకళ్లేపల్లిలోని పాఠశాలలో తొలి అడ్మిషన్ పొందారు. అక్కడే ఓనమాలు దిద్దారు. తర్వాత చలపతిరావుకు మొవ్వ మండలం భట్లపెనుమర్రుకు బదిలీ కావటంతో అక్కడే ప్రాథమిక విద్య, మచిలీపట్నంలోని హిందూ హైస్కూల్లో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించారు. పింగళి వెంకయ్య తాత నుంచి తండ్రి, బాబాయిలు అత్యధికులు యార్లగడ్డ గ్రామానికి కరణాలుగా సేవ చేశారు. పామర్రు గ్రామ కరణం కుమార్తె రుక్మిణమ్మను వివాహం చేసుకున్న వెంకయ్యకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
19వ యేట సైన్యంలోకి...
ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంకయ్య గారు తన 19వ యేట సైన్యంలో చేరేందుకు ముంబై వెళ్ళారు. సైన్యంలో చేరి ఆఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే జాతిపిత మహాత్మాగాంధీని కలుసుకున్నారు. కొంతకాలానికి దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలటంతో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చేశారు. ప్లేగు వ్యాధి నివారణ చర్యల అధికారిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించారు. ఇంగ్లీష్ జపాన్, సంస్కతం, ఉర్దూ భాషలలో అనర్గంగా మాట్లాడగలరు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు మచిలీపట్నం జాతీయ కళాశాలలో ఆయన అధ్యాపకునిగా సేవ చేశారు. తన స్వగ్రామం చల్లపల్లి మండలం యార్లగడ్డ నుంచి మచిలీపట్టణమునకు ప్రతి రోజు వెళ్లి విధులు నిర్వర్తించేవారు.
పత్తి వెంకయ్యగా గుర్తింపు
మునగాల రాజా గారి ప్రోత్సాహంతో వెంకయ్య మునగాల సంస్థానంలో వ్యవసాయక్షేత్రాన్ని స్థాపించి పరిశోధనలు చేశారు. అమెరికా నుంచి రకరకాల పత్తి విత్తనాలు రప్పించి ప్రయోగాలు చేశారు. 1909లో ఏలూరులో జరిగిన వ్యవసాయ ప్రదర్శనలో పరిశోధనా ఫలితాలను వెంకయ్య ప్రదర్శించగా ఆయన ప్రతిభకు స్వర్ణపతకం లభించింది. తద్వారా ఆయనకు పత్తి వెంకయ్యగా పేరువచ్చింది, చల్లపల్లి సమీపంలో వ్యవసాయక్షేత్రం స్థాపించి దానికి స్వేచ్ఛాపురం అని నామకరణం చేశారు. అక్కడ చేసిన పరిశోధనలు బ్రిటీష్ వారి దష్టికి కూడా వెళ్లటంతో ఆయనకు రాయల్ అగ్రికల్చర్ సొసైటీ సభ్యత్వమిచ్చి గౌరవించారు. వజ్రాలపై కూడా పరిశోధనలు సాగించి వజ్రపు తల్లిరాయిని కనుగొన్న వెంకయ్యకు వజ్రాల వెంకయ్యగా పేరు వచ్చింది. 1919వ సంవత్సరంలో బందరు ఓడరేవు శిథిలమై పోవటం చూసి దాన్ని పునరుద్ధరించాలని గుర్తించిన వెంకయ్య బందరు ఓడరేవుపై నైజాం నవాబుకు రాజకీయంగా హక్కు ఉందని రుజువు చేస్తూ ఆంగ్లంలో ఒక గ్రంథమును వ్రాసి ప్రచురించారు. ఈ విషయం బ్రిటీష్ వారి కన్నెర్రకు కారణమైంది. అయితే వెంకయ్య గారిని నైజాం నవాబు బ్రహ్మరధం పట్టారు. బెజవాడ నుంచి స్పెషల్ కంపార్టుమెంట్లో నవాబుగారి అంతరంగిక సిబ్బంది ''గార్డ్ ఆఫ్ ఆనర్'' ఇచ్చి రాజబంధువుగా ఆహ్వానించి గౌరవించారు.
జాతీయ పతాకం రూపకల్పన
మహాత్ముని పిలుపునందుకుని 1906వ మనదేశానికో జాతీయ జెండా ఆవశ్యకను గుర్తించిన వెంకయ్య 1916వ సంవత్సరంలో కేవలం మూడు గంటల్లో మువ్వన్నెల జెండాను రూపొందించి బాపూజీకి అందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో రూపొందించిన పతాకానికి మహాత్మాగాంధీ రాట్నం జోడించి, అదే సమావేశంలో వెంకయ్య రూపొందించిన జెండాను జాతీయ జెండాగా నిర్ణయిస్తూ ఏప్రిల్ ఒకటో తేదీన ఏకగ్రీవ తీర్మానం చేశారు.
చివరిలో సాధారణ జీవితం
తనలోని జాతీయ భావాలు, మేథస్సుతో దేశానికి అపరిమితమైన సేవ చేసిన పింగళి వెంకయ్య దేశం నుంచి ఏమీ ఆశించలేదు. చివరి రోజుల్లో విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలో ఓ సాధారణ ఇంటిలో గడిపారు. ఆయన బయటకు వెళ్లేటప్పుడు ఖద్దరు లాల్చీ, దానిపై నల్లటి కోటు వేసుకునేవారు. ఆయన స్నేహమాధుర్యాన్ని చవిచూసిన వారిలో నాటి ప్రముఖులైన డాక్టర్ తెన్నేటి చలపతిరావు, నీలంరాజు, వెంకట శేషయ్య, ఆయుర్వేద వైద్యులు గూడూరి నమశ్శివాయ, కె.ఎల్.రావు, సిరీస్ కంపెనీ అధినేత సిరీస్ రాజు ఉన్నారు. భారతదేశానికి ఎనలేని సేవ చేసిన పింగళి వెంకయ్య 1963 జులై 4వ తేదీన మరణించారు. ఆయన సేవలకు సరైన గుర్తింపునివ్వటంలో భారత ప్రభుత్వం కొంత ఆలస్యం చేసిందనే ఆవేదన ఉంది. ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య అని అధికారికంగా ప్రకటించి, గత సంవత్సరం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించింది. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానం చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పింగళి వెంకయ్య కుమార్తెను ఘనంగా సత్కరించారు.
మొట్టమొదటిసారిగా లాల్ బహుదూర్ శాస్త్రి వెంకయ్య గారికి గుర్తింపు తీసుకొచ్చారు. భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో విజయవాడకు వచ్చిన లాల్ బహుదూర్ శాస్త్రి గాంధీహిల్ లోని గ్రంథాలయం హాలులో పింగళి వెంకయ్య ఫొటోను ఏర్పాటు చేయించి గుర్తింపునిచ్చారు. తర్వాత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. భారత పోస్టల్ శాఖ పింగళి వెంకయ్య ముఖచిత్రంలో కూడిన స్టాంపు విడుదల చేసి గౌరవించుకుంది. పింగళి వెంకయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించాలి. దేశానికి మహోన్నతమైన జాతీయ పతాకాన్ని అందించిన మహనీయునికి నేటివరకూ భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని అందించకపోవటం శోచనీయం. విద్యార్థులందరికీ పింగళి ఘనత తెలిసేలా సిబిఎస్‌ఈ సిలబస్‌లో పింగళి వెంకయ్య జీవిత చరిత్రను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.










