ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : నైపుణ్య అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్, శిక్షణ శాఖ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14న పెనుకొండలోని జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల రెండవ శుక్రవారం స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. జాబ్ మేళాలో 12 రకాల కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదవ తరగతి, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, బీటెక్ చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ ఖయ్యూం మాట్లాడుతూ గత నెల హిందూపురంలో నిర్వహించిన జాబ్ మేళాలో 506 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొనగా 205 మంది ఎంపిక చేశామన్నారు. పెనుకొండలో 14న నిర్వహించే జాబ్ మేళా లో నిరుద్యోగ యువత పాల్గొనాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్‌డిఒ భాగ్యరేఖ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, పిఆర్ ఎస్‌ఇ గోపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










