ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : ఇవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఇన్‌ఛార్జ్ ఎస్‌పి జిఆర్ రాధిక ఆదివారం తనిఖీ చేశారు. సోమవారం నుంచి సుమారు 20 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఇవిఎంల మొదటి దశ తనిఖీలను బెంగుళూరు బిఇఎల్ ఇంజినీర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఇన్ ఛార్జ్ ఎస్‌పి ఆదివారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తనిఖీలను చేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసేందుకు మొదటి దశ ఇవిఎంల తనిఖీలకు ప్రతి రోజూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించారు. ఇవిఎం గోదాముల వద్ద భద్రతను, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 3242 బేలట్ యూనిట్లు, 2559 కంట్రోల్ యూనిట్లు, 3162 వివి పాట్లు కలిపి మొత్తం 8980 కేటాయించినట్లు తెలిపారు. 8 బ్యాలెట్ యూనిట్లు, 2 కంట్రోల్ యూనిట్లు, 17 వివి పాట్ లు వెరసి 27 తిరిగి పంపించడం జరిగిందన్నారు. ఇవిఎంల తనిఖీలు నిర్వహణ సమయంలో మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతించడం జరగదని, ఏర్పాటు చేసిన కౌంటర్లలో విధిగా డిపాజిట్ చేయాలని చెప్పారు. డిజిటల్ చేతి గడియారం, ఎయిడ్ పాడ్స్ అనుమతించరని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఎటువంటి సందేహాలున్నా నిపుణుల వద్ద నివృత్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఎస్‌పి జి.మురళీధర్, తహశీల్దార్ ఎన్.శివన్నారాయన, ఈ సెక్షన్ పర్యవేక్షకులు డి.రవికుమార్, ఉప తహశీల్దార్ టి.వెంకటరమణ, బిజెపి, బీఎస్పీ, టిడిపి, వైసిపి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.










