Apr 05,2023 22:04

ఇసుక తరలింపును అడ్డుకుంటున్న టిడిపి శ్రేణులు

        ప్రజాశక్తి-మడకశిర   పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలంలో జెపి కాంట్రాక్టర్‌ అక్రమంగా ఇసుక తరలిస్తారని తెలుసుకున్న టిడిపి నాయకులు బుధవారం వెళ్లి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు టిడిపి కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలను పరామర్శించారు. అంతేగాకుండా స్థానిక సిఐ సురేష్‌బాబు, ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడి విడుదల చేయాలని కోరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఈరన్న కూడా స్టేషన్‌కు చేరుకుని టిడిపి నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈరన్న మాట్లాడుతూ పరిగి మండలంలోని జయమంగళి నదిలో ఇష్టానుసారం ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసి వైసిపి నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. వారి ఆగడాలను అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే టిడిపి కార్యకర్తలు, నాయకులను విడుదల చేసి ఇసుక అక్రమార్కులపై చర్యలు, తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి ఉగ్రనరసింహప్ప, రైతుసంఘం అధ్యక్షులు రాజగోపాల్‌, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రకాష్‌, క్రిష్టప్ప, శీనప్ప, అశ్వత్‌, పరిగి మండల నాయకులు కన్వీనర్‌ లక్ష్మీరెడ్డీ, టిడిపి రాష్ట్ర వాల్మీకి సాధికార సభ్యుడు ఈశ్వరప్ప, జిల్లా రైతు అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.