పరిగి: పరిగి మండలం జయమంగళి నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని గత వారం రోజులుగా కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు ఉధృత రూపం దాలుస్తున్నాయి. సోమవారం నాడు సిపిఎం, జనసేన ఆధ్వర్యంలో రీచ్ వద్ద నిరసన తెలిపారు. రీచ్ వద్ద నాయకుల ఆందోళనలు చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధం అయ్యారు. పోలీసుల కళ్లు గప్పి సిపిఎం, జనసేన నాయకులు స్థానిక ప్రజలు, రైతులతో కలిసి బోరెడ్డిపల్లి గ్రామం నుంచి పంట పొలాల మీదుగా కాలినడకన ఇసుక రీచ్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళకారులను బలవంతంగా అరెస్టు చేసి, మడకశిర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు, లింగారెడ్డి, రాము, సాంబ, జనసేన నాయకులు సురేష్, నాగేష్, రమేష్ తదితరులు ఉన్నారు. అరెస్టుల విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ పరిగికి చేరుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీరు దొరకడమే కష్టతరంగా మారిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొద్దిగా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జయమంగళి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి మళ్లీ నీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం వందల టన్నుల ఇసుకను టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. రీచ్ వల్ల తమకు నష్టం వాటిల్లితుందని, దీనిని రద్దు చేయాలని సమీప గ్రామాల ప్రజలందరూ ముక్తకంఠంతో ప్రభుత్వం, అధికారులకు నివేదిస్తున్నా వారు పట్టించుకోకపోవడం దుర్మార్గం ఉందన్నారు. వ్యక్తిగత స్వార్థంతో వైసిపి చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోవు రోజుల్లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధిచెబుతారని హెచ్చరించారు. వైసిప రీచ్‌ను రద్దు చేయకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. అరెస్టులకు తామ భయపడేది లేదని, ప్రజల కోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు.










