Apr 06,2023 22:49

నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి - పరిగి : నిబంధనలు గాలికి వదిలి జేపీ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ కంపెనీ వ్యక్తులు పరిగి జయ మంగలి నుండి చేపట్టిన ఇసుక అక్రమ తరలింపును ఆపాలని వైసిపి మండల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు గురువారం ఇసుక తరలింపు స్థలం వద్ద ఆందోళన చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలను సైతం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయించిన స్థలంలో కాకుండా మరోచోట ఇసుకను తోడుతున్నారని అన్నారు.. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా నిలుపుదల చేయకపోవడం ప్రజా వ్యతిరేక విధానమైననే మండల నాయకుడు ప్రభాకర్‌ విమర్శించారు. దీనిపై న్యాయవ్యవస్థను ఆశ్రయించి పూర్తిస్థాయిలో నిలుపుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గతంలో తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని అన్నారు. వర్షాలు బాగా కురవడం, తమ ప్రాంతంలో పెన్నా, జయమంగళీ నదులు పుష్కలంగా ప్రవహించడం వల్ల ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అయితే ఉన్న ఇసుకను ప్రైవేట్‌ కంపెనీ వారు తరలిస్తే తమకు తిరిగి నీటి ఎద్దడి ఎదురవుతుందని అన్నారు. మండలంలోని ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడుతామని అన్నారు. టిప్పర్లను, హిటాచిలను నది తీరం దాటిస్తామని హెచ్చరించారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు గుర్తించి ఇసుక రీచ్‌ను వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. అనంతరం ఇసుక రిచ్‌ వద్దకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పెనుగొండ సిఐ కరుణాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు నాయకులను హిందూపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అరెస్టు అనంతరం సిఐ కరుణాకర్‌ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అరెస్టు చేస్తున్నామని చెప్పారు. జెపి కన్స్ట్రక్షన్‌ వారు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ ఇసుక తరలింపును కొనసాగిస్తున్నారని ప్రజలు దీన్ని గుర్తించాలని చెప్పారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టాల్సి వస్తుందనిహెచ్చరించారు. ఇసుక తరలింపు పక్రియను ఆరుగురు ఎస్‌ఐలు, ముగ్గురు సిఐలు, 110 మంది కానిస్టేబుళ్ల పహారాలో నిర్వహిస్తుండటం గమనార్హం.